అడవిలన్ మాస్టర్ ప్లాన్

‘జైల్లో ఉన్న మాజీ ప్రియుడిని తుపాకీతో కాల్చి చంపాలి. ఒంటరిగా వదిలేసి వెళ్లిన భర్తను సైతం అదే తుపాకీతో తుదముట్టించాలి’ ఇదేదో తెలుగు సీరియల్‌లో సీరియస్‌గా సాగుతున్న సన్నివేశం కాదు. చెన్నైకి చెందిన ఓ వివాహిత తెలుగు సీరియళ్లలోని లేడీ విలనిజాన్ని మించిపోయింది. స్నేహితుల ద్వారా గుట్టు రట్టుకాగా ఇద్దరు యువకులతో పాటుకటకటాల వెనక్కు వెళ్లిపోయింది. డిటెక్టివ్‌ నావల్‌ను మించిన సంఘటనగురువారం వెలుగుచూసింది.

చెన్నై:
: ఇద్దరిని హత్య చేయాలని ఓ మహిళ చేసిన ప్రయత్నం టెలీ సీరియల్‌ తరహాలో సాగింది. చివరకు ఆమె కటకటాలపాలైంది. చెన్నై ఎంజీఆర్‌ నగర్‌ నేసపాక్కంకు చెందిన కార్తికేయన్‌ (38), మంజుల దంపతుల కుమారుడు రితేష్‌సాయి(10) కనిపించడం లేదని ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన పోలీసులకు కార్తికేయన్‌ ఫిర్యాదు చేశాడు. మంజులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నాగరాజన్‌ అనే వ్యక్తి రితేష్‌సాయిని ట్యూషన్‌ నుంచి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనను దూరం పెట్టిన ప్రియురాలు మంజుల పై కక్ష తీర్చుకునేందుకు ఆమె కుమారుడిని బాటిల్‌తో గొంతులో పొడిచి హత్యచేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్‌చేశారు.

విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న మంజులను అవినీతి ఆరోపణలపై అదే సమయంలో సస్పెండ్‌ చేశారు. భార్య వివాహేతర సంబంధం వల్ల కొడుకుని కోల్పోయాననే బాధతో కార్తికేయన్‌ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కొడుకును హత్యచేసిన నాగరాజ్‌ వల్ల తనకూ ప్రాణహాని ఉందని మంజుల భయపడింది. నాగరాజ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని మంజుల నిర్ణయించుకుంది. నాగరాజ్‌ బెయిల్‌పై విడుదల కాగానే మంచిగా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపాలని పథకం వేసుకుంది. సైదాపేట సీఐటీ నగర్‌లోని తన స్నేహితులు ప్రశాంత్‌ (28), సుధాకర్‌ (33)లను కలుసుకుని తుపాకీ కావాలని కోరింది. ఇందుకు వారిద్దరూ మంజుల నుంచి రూ.2లక్షలు పుచ్చుకున్నారు. తుపాకీ తెచ్చిచ్చారు. ఇంటికెళ్లి చూడగా అది బొమ్మ తుపాకీ అని తెలుసుకుంది.

వెంటనే తన స్నేహితులకు ఫోన్‌చేసి నిజమైనతుపాకీ అడిగితే బొమ్మ తుపాకీ ఇచ్చారేమిటని మంజుల ప్రశ్నించగా ‘నీకు తుపాకీ కొనిచ్చి మేము కూడా పోలీసులపాలు కావాలా, మర్యాదగా నోరుమూసుకోకుంటే నీ గురించి పోలీసులకు చెబుతాం’ అంటూ బెదిరించి ఫోన్‌కట్‌ చేశారు. దీంతో బొమ్మ తుపాకీతో రూ.2లక్షలు మోసం చేసిన ఇద్దరు స్నేహితులపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. రూ.2లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ ప్రశాంత్, సుధాకర్‌లపై సైదాపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వారిద్దరూ అసలు విషయాన్ని పోలీసులకు చెప్పడంతో బిత్తరపోయారు. నకిలీ తుపాకీతో నాగరాజన్‌ను హత్యచేసేందుకు పథకం వేసిన మంజులను, తుపాకీ పేరుతో రూ.2లక్షలను తీసుకున్న ప్రకాష్, సుధాకర్‌లను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

భర్తను కూడా చంపాలనుకున్నా : మంజుల
పోలీసుల అదుపులో మంజుల ఇచ్చిన వాంగ్మూలం ఆమెలోని మరింత క్రూరత్వాన్ని చాటాయి. ‘‘కుమారుడు హత్యకు గురైన తరువాత భర్తతో తగాదాలు మొదలయ్యాయి. విడాకులు ఇచ్చేందుకు ఆయన సిద్ధమైనారు. అయితే నేను అందుకు సమ్మతించలేదు. రితేష్‌ మరణానికి నీవే కారణమంటూ పదేపదే తగవు వేసుకునేవాడు. నన్ను ఒంటరిగా వదిలేసి వేరుగా ఉంటూ పోలీసులకు కూడా నాపై ఫిర్యాదు చేశాడు. అంతేగాక నాపేరున ఉన్న ఆస్తులన్నీ తన పేరుకు మార్చాలని ఒత్తిడిచేశాడు. అదే సమయంలో కుమారుడిని హత్యచేసిన నాగరాజ్‌ వల్ల నాకు ప్రాణాపాయం ఉందనే భయం ఏర్పడింది. దీంతో భర్త కార్తికేయన్, నాగరాజ్‌లను హత్యచేయాలని నిర్ణయించుకున్నాను. భర్త దూరమైన తరువాత సైదాపేట సీఐటీ నగర్‌లో ఉన్న నా చెల్లి ఇంటికి రాకపోకలు సాగిస్తున్నపుడే ప్రశాంత్‌తో పరిచయమైంది. రూ.2 లక్షలను తీసుకుని బొమ్మ తుపాకీ కొనిచ్చి వీరూ మోసం చేశారు. అందుకే అందరిపై కసిపెరిగింది ముఖ్యంగా నాగరాజ్, కార్తికేయన్‌లను చంపివేయాలని భావించా’’అని ఆమె చెప్పారు. పట్టుబడిన నిందితులు సుధాకర్‌ ఇప్పటికే హత్యానేరం కేసును ఎదుర్కొంటున్నాడు. ముగ్గురు నిందితులను గురువారం కోర్టులో ప్రవేశపెట్టి జైల్లో పెట్టారు.