ఎట్టకేలకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్:కాలుపెట్టగానే అరెస్ట్ చేశారు

ఎట్టకేలకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లో కాలుమోపారు. షరీఫ్, ఆయన కుమార్తె మర్యం నవాజ్‌లతో వచ్చిన విమానం లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వారి కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్న పోలీసులు విమానం నుంచి కింద కాలుపెట్టగానే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని రావల్పిండి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు విమానాశ్రయం నవాజ్ అభిమానులు, ఆయన పా్టీ మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమాస్తుల కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మర్యం నవాజ్‌లను దోషులుగా తేల్చిన అకౌంటబులిటీ కోర్టు గత శుక్రవారం జైలు శిక్ష విధించింది. నవాజ్‌కు పదేళ్లు, మర్యంకు ఏడేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.