ఒక్క సినిమా కూడా చేస్తానో.. లేదో

ఒక్క సినిమా కూడా చేస్తానో.. లేదో… అనే స్థాయి నుంచి పది సినిమాలు చేసే స్థాయికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నేర్చుకున్నది ఏంటంటే… క్రమశిక్షణ, కమిట్‌మెంట్‌ చాలా అవసరం! వీటన్నిటి కంటే ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే… పనులన్నీ అంత ప్రశాంతంగా జరుగుతాయి. ఎన్ని తలనొప్పులున్నా… సెట్‌కి వెళ్లేవరకూ మాత్రమే ఆలోచించాలి. వెళ్లాక పట్టించు కోకూడదు. సినిమా అనేది ఒక కళ. దానిపై ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి కనుక జాగ్రత్తగా నడుచుకోవాలి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ‘లవర్‌’ ప్రత్యేకమైనది. దానికి పది జత కలిసింది.
‘లవర్‌’ ఎలా ఉంటాడు?
మంచిగా ఉంటాడు. బేసికల్లీ… ఇదొక ప్రేమకథ మాత్రమే కాదు. ఇందులో క్రైమ్‌ ఎలిమెంట్‌ ఉంది. చిన్న మెసేజ్‌ ఉంది. ఓవరాల్‌గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌. నేను పర్ఫార్మ్‌ చేయడానికి, కొత్తగా కనిపించడానికి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌.
హీరోగా మీ తొలి మూడు సిన్మాలు సూపర్‌హిట్సే. సడన్‌ స్టార్‌డమ్‌ పర్సనల్‌ లైఫ్‌పై ఎఫెక్ట్‌ చూపించిందా?
యాక్చువల్లీ… నాట్‌! ‘ఉయ్యాలా జంపాలా’ కోసం రామ్‌మోహన్‌గారితో మూడేళ్లు ట్రావెల్‌ చేశా. అప్పుడాయన నా మైండ్‌సెట్‌ని ఎలా ట్యూన్‌ చేశారంటే… నాకెప్పుడూ నేను హీరోననే ఫీలింగ్‌ రాలేదు. ఎందుకంటే… ‘ఉయ్యాలా జంపాలా’కి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్ని కూడా! అసిస్టెంట్‌ వర్క్స్‌ చేస్తూ… అందులో హీరోగా నటించేవాణ్ణి. ఆ సినిమా తర్వాత… రామ్‌మోహన్‌గారి దగ్గర కూర్చుని ఒక స్ర్కిప్ట్‌ మీద వర్క్‌ చేశా. డైరెక్షన్‌ చేయాలనుకున్నా. కొంతవర్క్‌ జరిగాక… ఎందుకో అది కరెక్ట్‌ కాదని అనిపించింది. అప్పుడు ‘సినిమా చూపిస్త మావ’ ఛాన్స్‌ వచ్చింది. అది చేసే క్రమంలో ‘కుమారి 21ఎఫ్‌’ చేసే ఛాన్స్‌ వచ్చింది. అక్కణ్ణుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. చేశా.
మీ చివరి మూడు సినిమాలు సరిగా అడలేదు…
(మధ్యలో అందుకుంటూ…) ప్రతి సినిమాని చేసేటప్పుడు మంచి కన్విక్షన్‌తో బావుంటుందనే చేశా. కొన్ని కథలు బాగున్నా తీయడంలో తేడా కొడుతుంది. కొన్ని సినిమాలు నిర్మాణ విలువల వల్ల, ఆర్టిస్టుల వల్ల, దర్శకుల వల్ల పోవచ్చు… ఇలా వంద కారణాలుంటాయి. ఒక్కో సినిమా నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నా. ప్రతి సినిమా నేను నమ్మే చేశా. టీమ్‌ కూడా! ‘అంధగాడు’పై నాకెంతో నమ్మకం ఉండేది. విడుదల అయ్యాక సెకండాఫ్‌లో కొంచెం తప్పులు జరిగాయని అర్థమైంది. అవి సరిచేసుకుంటే పెద్ద హిట్‌ అయ్యేది. ఎంతో పొటెన్షియల్‌ ఉన్న కథ. ‘రంగుల రాట్నం’ కూడా అంతే. మంచి కథ. అయితే… ప్రేక్షకులు నానుంచి ఆశించే సినిమా కాదు. అందులోనూ పండక్కి విడుదల అయ్యింది. పండగ రోజున ఎవరూ ఏడ్వాలని అనుకోరు కదా! ఏ సినిమా ఆడుతుందో.. ఏది ఆడదో.. ముందే తెలిస్తే… అన్నీ హిట్‌ సినిమాలే చేస్తాం కదా!
ఎంతో నమ్మి చేసిన సినిమా సరిగా ఆడకపోతే బాధగా ఉంటుందేమో!
బాధ కచ్చితంగా ఉంటుంది. నేను చాలా ఎఫెక్ట్‌ అవుతా. ఇందాక చెప్పినట్టు నమ్మి చేసినవి ఆడకపోతే కొంచెం బాధగా ఉంటుంది. వెంటనే బయటపడి వేరే సినిమా చేస్తాం. ముందు నుంచి తెలిసినా కొన్ని తప్పులు జరుగుతాయి కదా! అవి కొంచెం ఎక్కువ బాధిస్తాయి.

అటువంటి సమయంలో ‘నా కోసం నేను ఒక కథ రాసుకోవాలి’ అని అనిపించిందా?
నా సమస్య ఏంటంటే… కథలు రాస్తా గానీ, రాసేటప్పుడు పిక్చర్‌లోకి నేను వస్తే మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. ఎందుకో మరి… నా కథలో నేను కనపడను. ఇంకొకరిని ఊహించుకుని రాసుకుంటా. నేను ఎప్పుడూ యాక్టర్‌ కావాలని అనుకోలేదు కదా! అందుకని, నన్ను నేను హీరోగా ఊహించుకోలేను. ఫర్‌ ఎగ్జాంపుల్‌… ‘కమర్షియల్‌ సినిమా రాయాలి. హీరో కొడితే గాల్లోకి ఇద్దరు ఎగురుతారు’ అంటే మరో హీరోని ఊహించుకోగలను. నేను కొడితే ఇద్దరు ఎగురుతారనే సన్నివేశాన్ని ఊహించుకోలేను.
దర్శకులకు సలహాలు ఇవ్వడం, పనిలో జోక్యం చేసుకోవడం?
దర్శకుడు ఏది అడిగితే… అది ఇవ్వడమే నాకు తెలుసు. అంతకంటే ఇంకేం తెలీదు. ఉదాహరణకు… ‘లవర్‌’ సినిమాకు ‘దిల్‌’ రాజుగారు వంటి నిర్మాత ఉన్నప్పుడు నా ఇన్వాల్వ్‌మెంట్‌ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా! ‘కుమారి 21ఎఫ్‌’లోనూ నా ఇన్వాల్వ్‌మెంట్‌ లేదు. నేను ఎవరి పనిలోనూ జోక్యం చేసుకోను.
హీరో అంతకు ముందు దర్శకత్వ శాఖలో పని చేయడం వల్ల ప్లస్సులేంటి? మైనస్సులేంటి?
డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేయడం వల్ల టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వస్తే ఆయా హీరోలు అర్థం చేసుకుంటారు. అనవసరంగా హర్ట్‌ అవ్వడాలు, కోపాలు, ఈగోలు ఉండవు. నాకు తెలిసి మైనస్సులు ఏం ఉండవు. కానీ, బ్యాడ్‌ టీమ్‌తో వర్క్‌ చేస్తున్నప్పుడు ‘సమ్‌థింగ్‌ ఈజ్‌ గోయింగ్‌ రాంగ్‌’ అనేది వెంటనే అర్థమవుతుంది. అయుతే… అందులో జోక్యం చేసుకోలేము. అక్కడ ప్రాబ్లమ్‌ వస్తుంది. నా విషయంలో ఒక్కసారి అటువంటి సమస్య వచ్చింది. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తికాగానే అర్థమైంది… సినిమా తేడా కొడుతుందని!
షూటింగ్‌ డే మీ షెడ్యూల్‌ ఎలా ఉంటుంది?
సెట్‌లో ఎప్పుడూ టైమ్‌కి ఉంటాను. బేసిక్‌గా… షూటింగ్‌ ఉందంటే వేకువజామున మెలకువ వచ్చేస్తుంది. అలారమ్‌ అవసరం కూడా ఉండదు. రాత్రి నిద్రపోయే ముందు నుంచి ఒత్తిడి ఉంటుంది. డబ్బింగ్‌ వంటి పనులకు పావుగంట, అరగంట లేటుగా వెళతానేమో కానీ… షూటింగ్‌కి అసలు లేటుగా వెళ్లను. హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో మనకు ఈజీగా 10, 20 నిమిషాలు లేటవుతుంది. బైక్‌ మీద ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా లేట్‌ కాదు. ట్రాఫిక్‌ ప్రాబ్లమ్‌ ఉండదు. ఇటీవల హ్యార్లీ డెవిడ్‌సన్‌ బైక్‌ ఒకటి కొన్నా.
బైక్‌ మీద వెళితే… జనాలు గుర్తు పట్టడం లేదా?
హెల్మెట్‌ పెట్టుకుంటాను. సినిమాలో ఏదైనా సన్నివేశం కోసం హెల్మెట్‌ వద్దంటే తప్ప… మామూలుగా అయితే హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేయను. యూత్‌ కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. స్టైల్‌ కోసం చూస్తే… ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
పెళ్లి ఎప్పుడు?
యాక్చువల్లీ… 27 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. వచ్చే ఏడాదికి 27 ఏళ్లు పూర్తవుతాయి. ఆలోచించాలి. అమ్మానాన్న ఒత్తిడి చేయడం లేదు. మా తాతగారే పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారు. పెళ్లి విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఓ ప్లాన్‌, ఓ ఐడియా ఏం లేదు. ఒక రెండు సినిమాలు మంచిగా చేసి ప్రశాంతంగా అప్పుడు పెళ్లి చేసుకుందామని!
ఆ క్రెడిట్‌ అంతా హర్షిత్‌దేనా?
‘లవర్‌’లో నా లుక్‌ ఒక్కటే కాదు… కాస్ట్యూమ్స్‌, హెయిర్‌ స్టైల్‌ ప్రతి విషయంలోనూ హర్షిత్‌ (‘దిల్‌’ రాజు సోదరుని కుమారుడు, ‘లవర్‌’ నిర్మాత) ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలో స్టిఫ్‌గా కనిపించాలని రోజూ జిమ్‌కి పంపేవాడు. తర్వాత హెయిర్‌కట్‌ అని ముంబై తీసుకువెళ్లాడు. కాస్ట్యూమ్స్‌ పరంగానూ కేర్‌ తీసుకొన్నాడు. సినిమాలో నేను బావున్నానంటే ఆ క్రెడిట్‌ హర్షిత్‌దే!
ఒక అమ్మాయి మీకు లవర్‌ అవ్వాలంటే..
నన్ను భరించగలిగితే చాలు! (నవ్వులు) ఎందుకంటే…. నేను కంప్లీట్‌గా ఆఫ్‌ మైండెడ్‌ పర్సన్‌. బయటకు వెళ్లడానికి ఇష్టపడను. ఎక్కువగా ఇంట్లో కూర్చుంటా. సినిమా చూసేటప్పుడు నన్ను ఎవరూ డిస్ట్రబ్‌ చేయకూడదు. సడన్‌గా మూడ్‌ వస్తే టైమ్‌తో సంబంధం లేకుండా నిద్రలేచి కూర్చుంటాను. అప్పుడూ డిస్ట్రబ్‌ చేయకూడదు.

Leave a Reply