కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సభలో రాజకీయ నినాదాలు హోరెత్తాయి,

విశాఖపట్నం జిల్లా శంకుస్థాపనల సభలో రాజకీయ నినాదాలు హోరెత్తాయి. సీఎం చంద్రబాబు వస్తుండగా మోదీకి జైకొట్టిన బీజేపీ కార్యకర్తలు.. వారిపై టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు అధికారిక కార్యక్రమాన్ని అపహాస్యం చేశాయి. చివరకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ‘మీరు మౌనం వహిస్తే నేనుంటాను, లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను’ అంటూ బీజేపీ, టీడీపీ శ్రేణులను వారించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన 7 ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమం బీజేపీ, టీడీపీ శ్రేణుల మధ్య రగులుతున్న అంతర్గత వైషమ్యాలకు వేదికగా నిలచింది. వారి మధ్య దూరాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది.

బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తమ పార్టీ కండువాలతో సమావేశ మందిరంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలోనికి అడుగుపెడుతుండగా బీజేపీ కార్యకర్తలు మోది.. మోది అంటూ నినాదాలు చేశారు. దీనితో భిన్నుడైన ముఖ్యమంత్రి కొంత అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు భారత మాతాకీ జై, మోదీకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.

పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన గడ్కరీ స్వయంగా మైక్‌ అందుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

Leave a Reply