తెలుగు సినిమాఅను నేను ప్రపంచమంతా కలక్షన్లను సృస్టీస్తానుఅని ప్రమాణం చేస్తున్నాను

ఏ తెలుగు సినిమా విడుదలైనా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌, సెకండ్‌ డే కలెక్షన్స్‌ అంటూ లెక్కలు చెప్పేస్తుంటారు. ఇందులో ఆంధ్రా, నైజాం, సీడెడ్‌తో పాటు ఇప్పుడు యుఎస్‌ మార్కెట్‌ కూడా చేరిపోయింది. అమెరికాలో.. వీకెండ్‌లో ఓ తెలుగు సినిమా బాగా ఆడిందంటే, అది పెద్ద హిట్టే. ఎంత గొప్ప హిట్టంటే, బాలీవుడ్‌ ఆ బాదుడుకు కుదేలైపోయేంత.

వెండితెర వెలిగిపోవడం అంటే ఇదే. అదీ అక్కడో ఇక్కడో కాదు.. ఏకంగా అమెరికాలోని థియేటర్లలో. సుధీర్‌బాబు ‘సమ్మోహనం’ మొదటి రెండు రోజుల్లోనే లక్ష డాలర్లను సాధించింది. ‘మహానటి’ 2.5 మిలియన్‌ డాలర్లు… అంటే, దాదాపు రూ.17 కోట్లు వసూలు చేసింది. ప్రస్తావిస్తూపోతే… యుఎస్‌ బాక్సాఫీసును ఊపిపడేసిన తెలుగు సినిమాల జాబితా పెద్దదే. మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’, రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ అటూ ఇటుగా.. మూడు మిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. అదే సమయంలో విడుదలైన ‘బాఘీ2’ మిలియన్‌ డాలర్ల దగ్గరే ఆగిపోయింది. విడుదలైన వారంరోజుల లోపే మిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకుంటున్న చిత్రాల్లో టాలీవుడ్‌ ముందుందనీ, ఆమేరకు బాలీవుడ్‌ వెనక్కి వెళ్లిందనీ ట్రేడ్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

‘పడమటి సంధ్యారాగం’ సమయంలో తెలుగువారు అమెరికాలో అక్కడక్కడా మాత్రమే తారసపడేవారు. కానీ నేడు ‘మైగ్రేటెడ్‌ ఇండియన్స్‌’లో తెలుగువారే అధికం. ‘మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ రిపోర్ట్‌ – 2017 ప్రకారం… నార్త్‌ అమెరికాలో ఇండో అమెరికన్స్‌ అతి వేగంగా పెరుగుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఆ సంఖ్య 69.4 శాతం వృద్ధి చెందింది. అందులో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు వీరు ప్రాధాన్యం ఇస్తారు. సినిమాలు తెలుగువారి జీవితాల్లో ఓ భాగం. ఇద్దరు తెలుగువాళ్లు కలుసుకుంటే ముందు సినిమాల గురించే మాట్లాడుకుంటారు.. ఆ తర్వాతే, రాజకీయాలైనా స్పోర్ట్స్‌ అయినా. సినిమా కలెక్షన్లకు దోహద పడుతున్న మరో అంశం టికెట్‌ ధరలు. సాధారణంగా విడుదలైన తొలి వారాంతంలో అమెరికాలో హిందీ సినిమా టికెట్‌ ధర 8-10 డాలర్ల వరకు ఉంటుంది. తెలుగు సినిమా టికెట్‌ దీనికంటే ఎక్కువే. బాహుబలి-2 టికెట్లను అప్పట్లో 15 – 20 డాలర్లకు అమ్మారు. వీటన్నిటి కారణంగా… తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా.. బాలీవుడ్‌పై ఆధిక్యం సాధిస్తోంది. ఈ జైత్రయాత్ర మొదలైంది రాజమౌళి ‘బాహుబలి-2’తోనే. 20 మిలియన్‌ డాలర్లకు మించి యుఎస్‌లో వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ సినిమాగా ఆ చిత్రం రికార్డుకెక్కింది. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్స్‌ ‘దంగల్‌’ 12 మిలియన్‌ డాలర్లు, ‘పికె’ 10 మిలియన్‌ డాలర్లూ కురిపించాయి.

మొత్తానికి, బాలీవుడ్‌ పరిస్థితి ఇరకాటంలో పడింది. అటు అమెరికన్‌ మార్కెట్‌ను టాలీవుడ్‌ ఆక్రమించుకుంటుంటే… ఇక్కడ ఇండియన్‌ మార్కెట్‌ను హాలీవుడ్‌ లాగేసుకుంటోంది. ఇటీవల పెద్ద సినిమాలు లేకపోవడంతో హాలీవుడ్‌ సినిమాలు ‘ఫ్యూరియస్‌ 7’, ‘ ఎవెంజెర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అలా్ట్రన్‌’ ఇండియన్‌ మార్కెట్లో చక్కటి బిజినెస్‌ చేశాయి. 1993లో ‘జురాసిక్‌ పార్క్‌’, 1996లో ‘ఇండిపెండెన్స్‌ డే’ బాగా ఆడి ఓ ట్రెండ్‌ సృష్టించాయి. ఆ ఒరవడి అలాగే కొనసాగుతూ నేడు హాలీవుడ్‌ సినిమాలకు పెద్ద మార్కెట్‌గా భారతదేశం అవతరించింది. కేవలం ఇంగ్లిష్‌ ఆడియన్స్‌ కోసమే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా డబ్‌ చేయడం, మల్టీప్లెక్స్‌ల సంస్కృతి పెరగడం దీనికి కారణం. ప్రస్తుతం ప్రతీ పెద్ద హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలలో డబ్‌ చేసి ప్రాంతాల వారీగా ఆయా భాషల్లో విడుదల చేస్తున్నారు. చిన్న సెంటర్లలో కూడా హాలీవుడ్‌ సినిమాలు విజయకేతనం ఎగరేస్తున్నాయి. అందుకే భారతీయ సినిమా బిజినెస్‌లో 20-25 శాతానికి హాలీవుడ్‌ చేరుకుంది. 2015లో రూ.160 కోట్ల దగ్గరున్న హాలీవుడ్‌ సినిమాల మార్కెట్‌ 2017లో 480 కోట్ల రూపాయలకు ఎగబాకింది. పాపం, బాలీవుడ్‌కే సినిమా కష్టాలు వచ్చినట్టున్నాయి.

Leave a Reply