తేజ్ ఐ లవ్యూ సినిమా రివ్యూ

నటీనట వర్గంసాయి ధరమ్ తేజ్,అనుపమ పరమేశ్వరన్,
జయప్రకాష్,పవిత్రా లోకేష్,వైవా హర్ష,వాణి సురేఖ
నిర్మాత కేఎస్ రామారావు
దర్శకత్వంకరుణాకరన్

సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్, జయప్రకాష్ వి, పృథ్వీ, వైవా హర్ష Director: కరుణాకరన్ టాలీవుడ్‌లో మెగా మేనల్లుడిగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్ ఆరంభించి వరుస విజయాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఇటీవల కాలంలో తేజ్‌కు విన్నర్, ఇంటిలిజెంట్ చిత్రాలు నిరాశను కలిగించాయి. దాంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్‌లో, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌‌తో జతకట్టి తేజ్ ఐ లవ్ యు చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తేజ్ సిద్ధమయ్యారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవడానికి తేజ్ తేజ్ ఐ లవ్ యు చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.

చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్.. పెద్దమ్మ, పెదనాన్న, బాబాయిల దగ్గర పెరుగుతుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళను దుండుగుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో హత్య చేసి ఏడేళ్ల శిక్ష అనుభవిస్తాడు. తన భర్త(అనిష్ కురువిల్ల)కు జరిగింది చెప్పి తన ప్రాణాలను కాపాడిన పిల్లాడి కోసం భారీ మొత్తంలో చెక్కు రాసిచ్చి ఆమె లండన్ వెళ్తుంది. కానీ ఆమె భర్త మాత్రం ఆ డబ్బును హీరో కుటుంబానికి ఇవ్వకుండా తన స్వార్థంతో కూతురి పేరిట ఆస్తులు కొని లండన్ వెళ్తాడు. చాలా ఏళ్ల తర్వాత అసలు విషయం తెలిసిన ఆమె బాధతోనే విదేశాల్లోనే కన్నుమూస్తుంది. చనిపోయే ముందు తన కూతురైన నందిని (అనుపమ)కి అసలు విషయం చెబుతుంది.

తన తల్లి ప్రాణాలను కాపాడిన అబ్బాయిని వెతుక్కుంటూ ఇండియా వచ్చిన నందిని హీరో తేజ్‌తో ప్రేమలో పడుతుంది. ప్రపోజ్ చేయడానికి వెళ్తూ యాక్సిడెంట్‌లో గతాన్ని మర్చిపోతుంది. తర్వాత హీరోయిన్ ప్రేమను హీరో ఎలా పొందగలిగాడు? తను వెతుకుతున్న అబ్బాయి హీరోనే అని హీరోయిన్ ఎలా తెలుసుకుంది? బాబాయి కూతురికి ప్రేమ పెళ్లి చేసి కుటుంబానికి దూరమైన హీరో మళ్లీ తన వాళ్లకు ఎలా దగ్గరయ్యాడు? అనేది స్థూలంగా ఈ సినిమా కథ. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా లవ్ స్టోరీకి ఉమ్మడి కుటుంబ అనుబంధాలను జోడించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కరుణాకరన్.

హీరో తన కజిన్‌కి పెళ్లి చేయడం, ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిందే. తర్వాత హీరోయిన్‌ను చూసి ప్రేమలో పడటం, వారిద్దరూ ఒకరిపై మరొకరు రివేంజ్ తీర్చుకోవడంతో ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. తొలి భాగంలో ఎక్కడా మనసును కట్టి పడేసే సన్నివేశాలు లేకున్నా బోరుగా ఫీలవకుండా చూడటం వరకు దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హీరో ప్రేమకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేందుకు వెళ్తూ హీరోయిన్ యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మర్చిపోతుందనే ఇంటర్వెల్ ట్విస్ట్‌తో దర్శకుడు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌‌‌ మరింత గ్రిప్పింగ్‌గా, ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. కానీ ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేయడంలో కరుణాకరన్ విఫలమయ్యాడు.

కరుణాకరన్ దర్శకత్వం దర్శకుడు కరుణాకరన్ ఇంకా తొలిప్రేమ హాయంలోనే ఉన్నట్టు కనిపించింది. తనకు తెలిసిన ఫార్ములానే మళ్లీ ప్రేక్షకులపై రుద్దేందుకు ప్రయత్నించారు. సక్సెస్ ఫార్మాలాను కనీసం జాగ్రత్తగా పట్టాలెక్కించిన బాగుండేదేమో. తొలిభాగంలో నాసిరకమైన సీన్లతో విసుగు పుట్టించడమే కాకుండా సహనానికి పరీక్ష పెట్టాడనిపిస్తుంది. కథలో ఎయోషనల్ పాయింట్స్ దట్టించి ఉంటే తొలిప్రేమ లాంటి విజయం దక్కడానికి ఆస్కారం ఉండేది.

అనుపమ గ్లామర్.. ఫెర్ఫార్మెన్స్ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ తారనే కాకుండా ఫెర్ఫార్మర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నందిని పాత్రలోని పలు రకాల షేడ్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకొన్నది. వాస్తవానికి నందిని పాత్ర లాజిక్కులకు దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకులకు చేరువ కావడం కష్టమైందని చెప్పవచ్చు. తన పాత్ర పరిధి మేరకు అనుపమ ఫర్వాలేదనిపించింది.

ఎవరెలా చేశారంటే.

హీరో సాయి ధరమ్, అనుపమ పరమేశ్వరన్ బాగా నటించారు. నందిని పాత్రలో అనుపమ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇంట్లో చెల్లెళ్లతో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే యువకుడిగా తేజ్ పాత్రలో సాయి మెప్పించాడు. హీరో పెదనాన్నగా జయప్రకాష్, పెద్దమ్మగా పవిత్రా లోకేష్ నటన ఆకట్టుకునేలా ఉంది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. తేజ్ పిన్నిగా వాణి సురేఖ, బాబాయిగా పృథ్వీ తమ పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. కానీ హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రలో నటించిన అనిష్ కురువిల్ల పాత్రకు చివర్లో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.

గోపి సందర్ సంగీతం తేజ్ ఐ లవ్ యు చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించారు. ‘చందమామ’ పాట తప్పితే పెద్దగా ఆకట్టుకునే పాటలు లేకపోవడం ప్రధాన లోపం. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీకి కావాల్సిన సాంగ్స్ లేకపోవడం నిరాశే. కాకపోతే సెకండాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది.

కథ, రచనా సహకారం ఈ చిత్రానికి డార్లింగ్ స్వామితో కలిసి కరుణాకరన్ రచనా సహకారం అందించారు. అక్కడక్కడ డైలాగ్స్ పేలాయి. కానీ ఫీల్ గుడ్ లవ్ స్టోరికి కావాల్సిన పూర్తిస్థాయి సరంజామా దట్టించలేదనే చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే మంచి ఫలితం దక్కడానికి స్కోప్ ఉండేది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించారు. 40 ఏళ్లలో ఆయన రూపొందించిన చిత్రాలు టాలీవుడ్‌లో అణిముత్యాలుగా నిలిచాయి. చిరంజీవితో రూపొందించిన చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అలాగే తేజ్ ఐ లవ్ యూ విషయానికి వస్తే నిర్మాణ విలువలకు ఏ మాత్రం కొదువలేదు. సాంకేతిక నిపుణుల, నటీనటుల ఎంపిక సూపర్‌గా ఉంది. కానీ కథే నాసిరకంగా ఉండటమనేది కొట్టొచ్చినట్టు కనిపించే అంశం.

చివరిగా
భారీ అంచనాలను అందుకోవడంలో, తన గత సినిమాల మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో డైరెక్టర్ కరుణాకరన్ సక్సెస్ కాలేకపోయాడు. కానీ పెద్దగా బోర్ కొట్టకుండా, సరదాగా చూడాలని అనుకునే వాళ్లు మాత్రం ఓసారి తేజ్‌ను చూసేయొచ్చు. కానీ తొలిప్రేమ లాంటి అద్భుతమైన సినిమాను కరుణాకరన్ నుంచి ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమాలో ఓ సందర్భంలో హీరో చెప్పినట్టే ‘తేజ్’ తొలి ప్రేమకథ బ్లైండ్‌గా ముగిసింది.