పంతం మూవీ రివ్యూ

విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను ఒప్పించిన గోపిచంద్‌కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సక్సెస్ బాట పట్టిస్తుందనుకొన్న గౌతమ్ నంద కొంత నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం కొత్త డైరెక్టర్ కే చక్రవర్తితో కలిసి పంతం చిత్రంతో ముందుకొచ్చారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో గోపిచంద్‌కు జతకట్టారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పంతం చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొన్నదో తెలుసుకోవాలంటే

కథలోకి వెళ్లాల్సిందే.
పంతం మూవీ కథ లండన్‌లో మల్టీ మిలియనీర్ కుమారుడైన విక్రమ్ సురానా (గోపిచంద్) ఓ పని కోసం ఇండియాకు వస్తాడు. ఊహించని పరిస్థితుల కారణంగా ఓ కార్యాన్ని భుజానకెత్తుకొని కామన్ మ్యాన్‌గా మారుతాడు. ఇండియాలో రకరకాల దోపిడి, అక్రమాలను చూసి చలించిపోతాడు. అందుకు కారణమైన హోంమంత్రి జయేంద్ర అలియాస్ నాయక్ భాయ్, ఆరోగ్యశాఖ మంత్రి (జయప్రకాశ్ రెడ్డి) దాచుకొన్న నల్లధనాన్ని దోచి అనాథ శరణాలయకు, కొంత మంది బాధితులకు పంచిపెడుతుంటాడు. తమ వద్ద నుంచి డబ్బు కొట్టేసేదెవరు అని తెలుసుకోవడానికి మంత్రులు తలపట్టుకొంటారు. ఈ క్రమంలో చివరికి నల్లధనాన్ని దోచుకొనేది విక్రమ్ అని తెలుస్తుంది.
క్లైమాక్స్‌కు దారిలా సంపన్నుడైన విక్రమ్ నల్లధనాన్ని దోచుకోవడానికి దారితీసిన కారణమేమిటి? తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో తారస పడిన అక్షర (మెహ్రీన్) ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? విక్రమ్ ఎత్తులకు మంత్రులు ఎలాంటి పై ఎత్తులు వేశారు. తాను అనుకొన్న లక్ష్యాన్ని విక్రమ్ ఎలా చేరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే పంతం సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్ సంపన్నులను,
అక్రమార్కులను దోచుకొని పేదవాళ్లకు పెట్టడమనే సింగిల్ లైన్ పాయింట్‌తో పంతం చిత్రం తెరకెక్కింది. వాడకం వాలేశ్వరరావు (పృథ్వీ) ఇంట చేరడం, కామెడీ ట్రాక్‌ ఉపయోగించుకొంటూ అసలు కథను తీసుకెళ్లే ప్రయత్నం తొలిభాగంలో జరిగింది. తాను అనుకొన్న బలమైన పాయింట్‌ను చెప్పడానికి దర్శకుడు చక్రవర్తి కాస్త సమయాన్ని ఎక్కువగానే హరించాడనే ఫీలింగ్ ఫస్టాఫ్‌లో కలుగుతుంది. తొలిభాగంలో వినోదాన్ని పంచడానికి ఫిక్స్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

సెకండాఫ్‌ అనాలిసిస్
ఇక రెండో భాగంలోనైనా కథను నేరుగా చెప్పుతాడా అనే ప్రేక్షకులకు ఓ రకమైన పరీక్షనే పెట్టాడు. చివరి సీన్‌ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఊరించి మెల్లగా చెప్పే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ భాగంలో చివరి పది హేను నిమిషాలు అసలు కథ ముడివిప్పి సందేశాల మీద సందేశాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ దర్శకుడు తన అనుకొన్న పనిని కానిచ్చేశాడనిపిస్తుంది. ఎంచుకొన్న మంచి పాయింట్‌‌ను చెప్పడానికి చాలా కష్టాలు పడినట్టు అర్ధమవుతుంది

దర్శకుడి పనితీరు
తొలి చిత్ర దర్శకుడు చక్రవర్తి పనితీరు బాగానే ఉంది. ఓవరాల్‌గా సినిమా మేకింగ్‌‌పై మంచి పట్టు ఉందనిపిస్తుంది. కొత్త దర్శకుడంటే ప్రేక్షకులు ఎక్కువగానే ఊహించి థియేటర్‌కు వస్తారు. కానీ దర్శకుడు మాత్రం ఇప్పటికే పలుమార్లు వాడేసిన పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే కొన్ని సీన్లు హార్ట్ టచింగ్ ఉంటాయి. రాళ్లపల్లి భార్య పార్వతి మరణం, బాంబు బ్లాస్ట్ బాధితుల కథనాలు ప్రేక్షకుడి గుండెను పిండేస్తాయి. చివర్లో గోపిచంద్‌తో ఆవేశంగా చెప్పించిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. కాకపోతే పాత సీసాలో కొత్త సారా రుచి కాస్త తేడాగా ఉందనిపిస్తుంది.

రొటీన్‌గా గోపిచంద్‌
హీరో గోపిచంద్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. మొన్నీ మధ్య వచ్చిన గౌతమ్ నందలో ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించాడు. కాకపోతే ప్రజలను జాగృతం చేసే సందేశమివ్వడమే గోపిచంద్‌కు కొత్త అంశం. పాటలు, ఫైట్లు, డైలాగ్స్ విషయంలో ఇరుగదీశాడని చెప్పడం రొటీన్‌గానే అనిపిస్తుంది. ప్రస్తుతం తన ఖాతాలో హిట్ పడాల్సిన సమయంలో గోపిచంద్ మళ్లీ రొటీన్ కథతో ముందుకొచ్చాడేమిటనే మాట వినిపించడం ఖాయం.

మెహ్రీన్ ఫిర్జాదా గ్లామర్

గోపిచంద్‌ ప్రియురాలిగా మెహ్రీన్ అక్షర పాత్రలో కనిపించారు. కథలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో గ్లామర్‌కే పరిమితమై ఆటపాటలతో కనువిందు చేశారు. గోపిచంద్‌కు మంచి జోడి అనే విధంగా మార్కులు కొట్టేశారు. ఇక ముందు పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించాల్సిన తరుణం మెహ్రీన్‌కు వచ్చేసింది

కామెడీకి పెద్ద పీట
కామెడీ ప్రధాన అంశంగా పంతం చిత్ర కథ సాగుతుంది. తొలిభాగంలో హాస్యానికి పెద్ద పీట వేశారు. దాంతో పృథ్వీ, శ్రీనివాసరెడ్డి కొన్ని సీన్లలో విజృంభించారు. శ్రీనివాసరెడ్డి హీరో ఫ్రెండ్ పాత్రలో మరోసారి తన మార్కు కామెడిని పండించాడు. ఇక పృథ్వీ తన స్టయిల్‌కు మరింత మెరుగుపెట్టి ‘వాడకం’ పాత్రలో జీవించాడు. పృథ్వీ భార్యగా సత్య కృష్ణన్, కుమారుడు పాత్రలు చేదోడు వాదోడుగా నిలిచాయి.

సంపత్ రాజ్ విలనిజం
మిగితా పాత్రల విషయానికి వస్తే ప్రధాన విలన్‌గా సంపత్ రాజ్‌కు హోమంత్రి పాత్రలో కనిపించారు. ఆయనకు తోడుగా కామెడీ టచ్ ఉన్న విలనిజాన్ని జయప్రకాశ్ రెడ్డి ప్రదర్శించారు. ఈ ఇద్దరికి ఇవి రొటీన్ పాత్రలే. పెద్దగా చెప్పుకోవడానికి పాత్రల్లో పస కనిపించదు. తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్, ముఖేష్ రుషి తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
గోపిసుందర్ మ్యూజిక్
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొనేలా ఉంది. కానీ పాటలే తెరపై అంతగా అలరించలేకపోయాయి. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ బాగుంది.

సినిమాటోగ్రఫి గురించి
పంతం చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫిని అందించాడు. రిచ్‌ లుక్‌లోనూ, మాస్ పాత్రలోను గోపిచంద్‌లో మంచి వేరియేషన్స్ చూపించాడు. మెహ్రీన్‌ మరింత గ్లామర్‌గా కనిపించింది. ఫారిన్ అందాలను చక్కగా బంధించారు. ఏఎస్ ప్రకాష్ నేతృత్వంలోని ఆర్ట్ విభాగం పనితీరు ఆకట్టుకొనేలా ఉంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్
పంతం చిత్రానికి కేకే రాధామోహన్. పాత్రల ఎంపిక, కథకు తగినట్టు సాంకేతిక నిపుణుల సెలెక్షన్ బాగుంది. సెకండాఫ్‌లో సినిమా లుక్ పరంగాను, కథ పరంగాను చాలా రిచ్‌గా కనిపించింది. అన్నీ బాగున్నప్పటికీ.. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

ఫైనల్‌గా గోపిచంద్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం పంతం. పాత కథకు కొత్తగా కామెడీని జోడించి సమకాలీన రాజకీయ పరిస్థితులపై సంధించిన విమర్శనాస్త్రం అని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన బట్టి సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.
బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్ గోపిచంద్, మెహ్రీన్ కామెడీ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ రెగ్యులర్ కథ, కథనాలు పేలవమైన విలనిజం