పల్సర్‌ మోటారు సైకిల్‌.. ఇద్దరు కుర్రాళ్లు: 18.50 తులాల బంగారం::దోచుకుపోయారు

chain snatchers

పల్సర్‌ మోటారు సైకిల్‌.. ఇద్దరు కుర్రాళ్లు… ఒకే తీరుగా గొలుసులను తెంచుకుని చేజిక్కించుకుని పారిపోవటం… గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన వారి దోపిడీ పర్వం సరిగ్గా 8.24 గంటలకు ముగిసింది. ఎన్‌ఏడీ సమీపంలోని సుసర్ల కాలనీలో మొదలుపెట్టి.. పక్కనే ఉన్న శాంతి నగర్‌.. కొద్ది రూపంలో ఉన్న మర్రిపాలెం వుడాలేఅవుట్‌.. ఆ తరువాత బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ వరకు సాగింది. దాదాపు 25 నిమిషాల వ్యవధిలో ఏకంగా 18.50 తులాల బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. బాధితులందరూ మహిళలే. వారు ఏమరుపాటుగా ఉన్న సమయంలో వెనకవైపు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చి గొలుసులను బలంగా లాగి పరారయ్యారు.
వరుస గొలుసుల దోపిడీలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా తనిఖీలు మొదలు పెట్టింది. క్రైం విభాగం, క్లూస్‌టీంలు రంగంలోకి దిగి ఆధారాల్ని సేకరించాయి. ఘటనల ప్రాంతాల్లో ఉన్న నిఘా కెమెరాల ఆధారంగా అన్నిచోట్లా ఇద్దరే దోపిడీలకు పాల్పడినట్టు బలంగా అనుమానిస్తున్నారు. గురువారం రాత్రికి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలను రాబడుతున్నారు. ఉదయం సుసర్లకాలనీలో దోపిడీ ఘటన తరువాత కంచరపాలెం క్రైమ్‌ సీఐ ఎన్‌.సాయి, క్రైం ఎస్‌.ఐ.మన్మధరావు సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందితుల కోసం గాలించారు. అంతలోనే అక్కడికి సమీపంలోనే ఉన్న శాంతినగర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ స్థానికులు దొంగలను వెంబడించినా వారిని పట్టుకోవటం సాధ్యం కాలేదు.
మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో మరో ఘటన చోటుచేసుకున్నాక కంచరపాలెం క్రైమ్‌ సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మన్మథరావు బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. మూడు ప్రాంతాలకు పోలీసు జాగిలాలను తీసుకెళ్లి పరిశీలించినా.. అవి కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చేశాయి. ఈ మూడు దోపిడీలపై కంచరపాలెం క్రైం సీఐ ఎన్‌.సాయి, క్రైం ఎస్‌.ఐ. ఎ.మన్మధరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలయ్యశాస్త్రిలో ఘటనపై నాలుగో పట్టణ క్రైం ఎస్‌.ఐ. వెంకట్రావ్‌ కేసు నమోదు చేశారు.
సమయం గురువారం ఉదయం 7:45 గంటలు
ఎన్‌ఏడీ కూడలి బుచ్చిరాజుపాలెం సుసర్ల కాలనీ 80 అడుగుల రహదారి ప్రశాంతంగా ఉంది. అదే రహదారిలోని మైత్రి అపార్టుమెంట్‌లో నివాసముంటున్న మంగయ్యమ్మ(60) పాల ప్యాకెట్ల కోసం రోడ్డుపైకి వచ్చింది. సమీపంలోని దుకాణంలో ప్యాకెట్లు తీసుకుని తిరిగి ఇంటిముఖం పట్టిన ఆమెను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనుసరించారు. ఆమె వారిని చూసేలోపే ఒక్కసారిగా మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఉడాయించారు. వెంటనే తేరుకున్న బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. చోరీకి గురైన తాడు విలువ రెండు తులాలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది
సమయం గురువారం ఉదయం 8:10 గంటలు
ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌లో నివాసముంటున్న నిర్మలా కుమారి నారాయణ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తోంది. ఎప్పటిలాగే పాఠశాలకు గురువారం ఉదయం ఆమె బయలుదేరింది. మరికొద్ది సేపటిలో స్కూల్‌కు చేరుకుంటుందనగా… ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని రెండు తులాల తాడు తెంపుకుని పారిపోయారు. ఆ సమయంలో దొంగా… దొంగా… అని అరిచినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు యువకులు బైక్‌ ఉన్నారని తెలిపింది. జరిగిన ఘటనపై నిర్మలా కుమారి పోలీసులను ఆశ్రయించింది.

సమయం గురువారం ఉదయం 8:15 గంటలు
మర్రపాలెం ఉడా లే అవుట్‌లో నివాసముంటున్న హేమలత తన పిల్లలను స్కూల్‌లో దించేందుకు స్కూటీపై బయలుదేరింది. ఇంటి నుంచి ఉడా లే అవుట్‌ పార్క్‌ సమీపానికి వచ్చేసరికి… వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసలు దండ, చైన్‌ తెంచకుని పారిపోయారు. ఈ హఠాత్‌ పరిణామంతో హేమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. రోడ్డుపైకి రాగానే ఇద్దరు వ్యక్తులు తనను కొంతదూరం అనుసరించారని, ఇలా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడతారని తాను ఊహించలేదని ఆమె వాపోయింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సమయం గురువారం ఉదయం 8:30 గంటలు
నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలయ్య శాస్త్రి లే అవుట్‌లోని రాధాకృష్ణ లే అవుట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వై.వెంకటలక్ష్మి(58) గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పాలు కోసం దుకాణానికి బయలుదేరింది. ఆమె రోడ్డుపైకి వచ్చిన కొద్ది సేపటికే ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి మెడలోని పుస్తెలతాడుతోపాటు మరో చైన్‌ తెంపుకుపోయారు. దీంతో లబోదిబోమంటూ వెంకటలక్ష్మి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు క్రైం ఎస్‌ఐ వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply