పవన్‌కి కళ్ళు కనిపించవా :గంట


విశాఖలో భూ కుంభకోణంపై సిట్‌ విచారణ జరపాలని కోరింది తనేనని, భూ ఆక్రమణలపై ఆరోపణలు రాగా న్యాయవిచారణ చేయిస్తారా? సీబీఐకి లేదా సీఐడీకి ఇస్తారా..? సిట్‌ వేస్తారా..? అని ప్రభుత్వానికి అప్పట్లో లేఖ రాశానని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తెదేపా కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. భీమునిపట్నం పరిధిలో భూ ఆక్రమణలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆరోపణలపై మంత్రి గంటా స్పందించారు. సిట్‌ బృందం క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. దీన్ని బయటపెట్టమని ముఖ్యమంత్రిని ఇదివరకే కోరినట్లు చెప్పారు. అది బయటకొస్తే అక్రమాల వెనుక మంత్రులున్నారా..? ఎమ్మెల్యేలున్నారా..? ఎంపీలున్నారా..?అధికారులున్నారా..? ఇంకెవరన్నా పెద్దలున్నారా..? అన్నది తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నివేదిక బయటపెట్టి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని మళ్లీ సీఎంను కోరతానన్నారు. వందల ఎకరాలను మీరో దోచుకున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపిస్తున్నారు కదా.. దీనిపై మీ స్పందన ఏమిటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి గంటా స్పందిస్తూ.. వేల.. లక్షల ఎకరాలని అంటుంటే.. మీరు వందల ఎకరాలు అంటారేంటని నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశారు.
పవన్‌కు అభివృద్ధి కనబడలేదా..?
రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కనబడడంలేదా..? అని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. హుద్‌హుద్‌ తుపాను విధ్వంసం తరువాత విశాఖ భవిష్యత్తుపై అందరూ ఆందోళన చెందారని.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 11 రోజులు బస్సులోనే ఉండి విశాఖను పునర్నిర్మించారని గుర్తుచేశారు. విశాఖను పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేందుకు 60 శాతం పనులు పూర్తిచేయించిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 53 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, విశాఖ ఉక్కు కర్మాగారానికి, నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టును రూ.16,500 కోట్లతో నిర్మించి ఉత్తరాంధ్రలోని ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరందించాలని తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
ఎక్కడికెళ్లినా భీమిలిలో గంటాను గెలిపించాను.. అక్కడ ఆ అభ్యర్థిని గెలిపించాను.. ఏకంగా తెలుగుదేశం పార్టీనే గెలిపించాను.. అని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసుకుంటున్నారని.. తెదేపా విజయానికి ఆయనే కారణమన్న భ్రమలో ఉన్నారని మంత్రి గంటా ఎద్దేవా చేశారు. గెలిచిన చోట మీ ప్రభావమైతే.. ఓడిన స్థానాల సంగతేమిటని ప్రశ్నించారు. విలేకర్ల సమావేశంలో తెదేపా నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ.రెహమాన్‌, తెదేపా నాయకుడు కాశీవిశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.