పొలాల్లోనే ఆమె పరుగు. కనీసం బూట్లు లేకుండా : ప్రపంచ ఛాంపియన్‌

పులి పేరు హిమదాస్‌
వయసు: 18 ఏళ్లు
పుట్టింది: అసోంలోని థింగ్‌ గ్రామంలో
నేపథ్యం: వ్యవసాయ కుటుంబం
ఆటలు: అథ్లెట్‌ కాక ముందు ఫుట్‌బాల్‌ ఆడేది
అథ్లెటిక్స్‌ విభాగం: 400 మీటర్ల పరుగు
కోచ్‌: నిపాన్‌దాస్‌
ఘనత: అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
లక్ష్యం: ఒలింపిక్స్‌లో పతకం
ఐదేళ్ల క్రితం వరకు హిమకు అథ్లెటిక్స్‌ అంటే ఏమిటో తెలియదు.. రెండేళ్ల ముందు వరకు ఆమెకు సరైన బూట్లు కూడా లేవు.. ఏడాది క్రితం వరకు ప్రపంచ స్థాయి పోటీలు ఎలా ఉంటాయో ఎరుగదు.. అయినా అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శివంగిలా దూకింది… ఎవరికి సాధ్యం కాని ఘనతను అందుకుంది.. భారత అథ్లెటిక్స్‌లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. భారత అథ్లెటిక్స్‌ తెరపై దూసుకొచ్చిన ఈ నయా సంచలనం భవిష్యత్‌పై ఆశలు రేపుతోంది.
ట్‌బాల్‌ నుంచి..
హిమదాస్‌ పుట్టింది అసోమ్‌లోని నాగోన్‌ జిల్లా థింగ్‌ గ్రామంలో.. రైతు కుటుంబం నుంచి వచ్చిన హిమ.. రంజిత్‌దాస్‌, జోమాలి దంపతుల ఆరుగురు సంతానంలో చిన్నది. ఆరంభంలో హిమ ఫుట్‌బాల్‌ ఆడేది. తన పాఠశాల జట్టులో ఆమే కీలక సభ్యురాలు. స్ట్రైకర్‌గా జట్టుకు విజయాలు అందించింది. అయితే ఆమె మైదానంలో మెరుపులా పరుగులెత్తే తీరు చూసిన పాఠశాల కోచ్‌ శాంసోల్‌ హిమకు ఫుట్‌బాల్‌ కంటే అథ్లెటిక్సే సరైందని భావించాడు. అప్పటి నుంచి ఆమె ఫుట్‌బాల్‌ వదిలి అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందడం మొదలుపెట్టింది. పొలాల్లోనే ఆమె పరుగెత్తేది.. కనీసం బూట్లు లేకుండా. గాయాలవుతున్నా కూడా లెక్క చేసేది కాదు. ఈ పట్టుదలే హిమలోని ఛాంపియన్‌ను బయటికి తీసుకొచ్చింది. ఒకవైపు నాన్న పొలంలో కష్టపడుతుంటే.. మరోవైపు హిమ పరుగులో కష్టపడేది. ట్రాక్‌ మీద కాకుండా మట్టిలో పరుగెత్తడం కూడా ఆమె వేగాన్ని పెంచింది. ఒకటి రెండు నెలల శిక్షణ తర్వాతే హిమ గువహాటిలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొని 100 మీ విభాగంలో కాంస్యం గెలిచింది. ఎలాంటి ప్రొఫెషనల్‌ శిక్షణ లేకుండా, వసతులు లేకుండా కేవలం తనపై తనకున్న నమ్మకంతో సాధించిన పతకమది. ఆ తర్వాత 2016లో కొయంబత్తూర్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో కాంస్యం గెలిచి తొలిసారి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది హిమ. అప్పటి వరకు ఆమెకు స్పైక్స్‌ (అథ్లెటిక్స్‌లో వాడే ప్రత్యేకమైన బూట్లు) అంటే తెలియదు. గన్‌ మోగగానే మెరుపులా పరుగెత్తడం ఒక్కటే తెలుసు.
అదే మలుపు..
హిమలో ఎంతో నైపుణ్యం ఉన్నా.. ప్రొఫెషనల్‌ శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంది. అథ్లెట్‌గా ఏం తినాలో తెలియదు.. ఏ బూట్లు వేసుకోవాలో తెలియదు.. ఎక్కడ సాధన చేయాలో తెలియదు. కానీ కోచ్‌ నిపాన్‌ ఆమెకు దిశానిర్దేశం చేశాడు. ఆమెను గువహాటిలోని స్పోర్ట్స్‌ అండర్‌ యూత్‌ వెల్ఫేర్‌ సెంటర్లో చేర్పించాడు. నిజానికి ఇక్కడ ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌లో మాత్రమే శిక్షణ ఇస్తారు. కానీ హిమ కోసం ప్రత్యేకంగా గది తీసుకుని అక్కడే ట్రాక్‌లో శిక్షణ ఇప్పించాడు. ఇదే ఆమె కెరీర్‌లో మలుపు. ఆ తర్వాత హిమ పరుగులో ఎంతో మార్పు. గతేడాది చెన్నై వేదికగా జరిగిన ఇండియన్‌ ఓపెన్లో 200 మీ. పరుగులో స్వర్ణం గెలిచిన హిమ… ఈ ఏడాది ఫెడరేషన్‌ కప్‌లో 400 మీ పరుగులో పసిడి గెలిచి గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికైంది. అయితే 400 మీ. పరుగులో ఆమె 51.32 సెకన్లలో వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌ నమోదు చేసినా.. ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు అంతర్‌ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో 200 మీ పరుగులో అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేస్తూ (51.13 సెకన్లు) స్వర్ణం గెలుచుకుంది. ఈ టైమింగ్‌ వల్లే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హిమ పతకం తేగలదని అందరూ నమ్మారు. 400 మీ పరుగులో 51.46 సెకన్లలో స్వర్ణం గెలిచి అందరి నమ్మకాన్ని నిలబెట్టింది హిమ. రేసు ఆరంభంలో వెనకగా ఉన్న హిమ.. చివరి 80 మీటర్లలో అద్భుతంగా పుంజుకుని పసిడి ఎగరేసుకుపోవడం అందర్ని ఆశ్చర్యపరిచింది.
అసలు సవాల్‌ ఇప్పటినుంచే..
ప్రపంచ స్థాయిలో హిమదాస్‌ ఇప్పుడే తొలి మెట్టు ఎక్కింది. ఆమెకు ఇక అసలు సవాల్‌ ఇప్పటి నుంచే. జమైకా, అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల నుంచి ప్రతిభావంతులైన అథ్లెట్లు పోటీలో ఉంటారు. వారందరికి దీటైన పోటీ ఇచ్చి సీనియర్‌ స్థాయిలో రాణించాలంటే హిమ కఠోర సాధన చేయక తప్పదు. 400 మీ. పరుగులో ఈ ఏడాది నమోదైన ఉత్తమ టైమింగ్‌ 49.52 సెకన్లు. అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హిమదాస్‌ స్వర్ణం సాధించినపుడు నమోదు చేసిన టైమింగ్‌ 51.46 సెకన్లు. అంటే సీనియర్‌ విభాగానికి ఆమె ప్రస్తుత టైమింగ్‌కు 2 సెకన్ల పైనే తేడా ఉంది. ఐతే ప్రస్తుతం హిమ వయసు 18 ఏళ్లే. వయసు తక్కువే కాబట్టి.. రాబోయే కొన్నేళ్లలో టైమింగ్‌ మెరుగుపరుచుకుంటే సీనియర్‌ స్థాయిలో పోటీ ఇచ్చే అథ్లెట్‌గా ఎదగగలదు. వచ్చే నెల ఆసియా క్రీడల రూపంలో ఆమెకు మరో పరీక్ష ఎదురు కాబోంతోంది.
అంతా కలలా ఉంది
‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం అంతా కలలా ఉంది. మా కుటుంబ నేపథ్యం ఏంటో మేమెంత కష్టపడ్డామో నాకు తెలుసు. నేనెప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటా.నా కుటుంబం కోసం దేశం కోసం ఏదో ఒకటి చేయాలని తపించాను. నేనిప్పుడు ప్రపంచ ఛాంపియన్‌ని’’
-హిమదాస్‌‘‘హిమదాస్‌ సాధించిన ఈ ఘనతకు యావత్‌ భారతం గర్విస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన హిమకు అభినందనలు. ఆమె విజయం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’
– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
‘‘హిమ ఎంతో పట్టుదల గల అమ్మాయి. తాను ఏదైనా సాధించాలని అనుకుంటే ఇంకా ఎవరి మాట వినదు. ఆమె మానసికంగా ఎంతో దృఢమైనది కావడం వల్లే ఈ దశకు చేరగలిగింది. హిమ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తుంది’’
– రంజిత్‌,హిమ తండ్రి

Leave a Reply