ప్రపంచ కప్‌ లోమూడో స్థానంలో నిలిచేదెవరో ?

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో ఓడిన వేదన నుంచి తేరుకుని, గౌరవప్రద స్థానంతో ప్రయాణం ముగించేందుకు బెల్జియం, ఇంగ్లండ్‌లకు ఓ అవకాశం. మూడో స్థానంలో నిలిచేదెవరో తేలేందుకు శనివారం ఇక్కడి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడున్నాయి. టోర్నీలో ఒకే గ్రూప్‌ ‘జి’లో ఉన్న ఈ జట్లులీగ్‌ దశలో ఎదురుపడ్డాయి. మొత్తం లీగ్‌కే చివరిదైన ఆ మ్యాచ్‌లో బెల్జియం 1–0తో నెగ్గింది.

రెండింటి చివరి ఘనత నాలుగే..!
1966 కప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌… 1990లో సెమీస్‌ చేరినా నాలుగో స్థానంతోనే సంతృప్తి పడింది. తర్వాత మరెప్పుడూ ఆ స్థాయి అందుకోలేదు. బెల్జియం కూడా 1986లో సెమీస్‌ చేరి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. కప్‌లో తమ రికార్డు మెరుగు పర్చుకోవడానికి ఓ విధంగా రెండింటికీ ఇదో అవకాశం. మరోవైపు టోర్నీ టాప్‌ గోల్‌ స్కోరర్‌ (6)గా ‘గోల్డెన్‌ బూట్‌’ రేసులో ఉన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌కు… ఈ సంఖ్యను మరింత పెంచుకునే వీలు దొరికింది. ఇంకొక్క గోల్‌ చేసినా 2002 (రొనాల్డొ, బ్రెజిల్‌–8 గోల్స్‌) తర్వాత అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడవుతాడు. ఒకవేళ కేన్‌ స్కోరు చేయలేకపోయి… బెల్జియం స్ట్రయికర్‌ రొమేలు లుకాకు రెండు గోల్స్‌ కొడితే ఇద్దరూ చెరో ఆరు గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ అందుకునేందుకు ముందువరుసలో ఉంటారు. బలాబలాల రీత్యా చూస్తే మ్యాచ్‌లో బెల్జియంకే కొంత మొగ్గు కనిపిస్తోంది. అయితే, ఫైనల్‌ చేరలేదన్న బాధను దిగమింగి, నిర్వేదాన్ని వీడి పునరుత్తేజంతో ఆడిన జట్టే విజేతగా నిలుస్తుంది.