ఫిఫాలో.. ఇంగ్లండ్‌కు షాక్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పెనుసంచలనం. క్రొయేషియా తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫిఫా-2018 తుదిసమరానికి చేరింది. మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. ఆట 5వనిమిషంలో ఇంగ్లండ్‌ ఆటగాడు ట్రిపియర్‌ గోల్‌ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ లో సీన్ మారింది.

క్రొయేషియా ప్లేయర్లు మైదానంలో చురుక్కుగా కదులుతూ ఇంగ్లండ్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. క్రొయేషియా ఆటగాడు పిరిసిక్ ఆట 68వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్‌లో ఇంగ్లండ్ కు షాకిచ్చింది క్రొయేషియా. 109వ నిమిషంలో క్రొయేషియా ప్లేయర్‌ మండూకిక్ గోల్ చేసి ఇంగ్లండ్ ఆశలను గల్లంతు చేశాడు. ఈ చిరస్మరణీయ విజయంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది.

Leave a Reply