ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌

గోల్స్‌ కొట్టే హీరోలు ఎంతమంది ఉంటేనేమి.. అవతలి జట్టు గోల్‌ పోస్టు ముందు గోడ కట్టేస్తే ఎంత ప్రయత్నించినా వృథానే! ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. ఫ్రాన్స్‌-బెల్జియం మధ్య తొలి సెమీఫైనల్‌తో ఈ సంగతి మరోసారి రుజువైంది. మ్యాచ్‌లో 60 శాతానికి పైగా బంతిని నియంత్రణలో ఉంచుకున్నా.. గోల్‌ దాడులు ఉద్ధృతంగా చేసినా.. బెల్జియం పరాజిత జట్టుగానే నిలిచింది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఆడిన మెరుపు షాట్లన్నింటినీ అడ్డుకున్న ఫ్రాన్స్‌.. ఒక్క గోల్‌ కూడా ఇవ్వలేదు. యువ ఆటగాడు శామ్యూల్‌ ఉంటిటి హెడర్‌ గోల్‌తో ఇచ్చిన ఆధిక్యాన్ని చివరిదాకా నిలబెట్టుకున్న ఫ్రెంచ్‌ జట్టు.. మూడోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో సెమీస్‌ దాకా వచ్చిన రెడ్‌ డెవిల్స్‌.. తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆశ తీరకుండానే నిష్క్రమించింది.
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు మేటి జట్ల మధ్య పోరు అంచనాలకు తగ్గట్లే సాగింది. సెమీఫైనల్లో ఫ్రాన్స్‌, బెల్జియం హోరాహోరీగానే తలపడ్డాయి. కానీ ఇరు జట్ల డిఫెన్స్‌ గోడ కట్టేసిన వేళ ఈ మ్యాచ్‌లో ఒక్కటే గోల్‌ నమోదైంది. 51వ నిమిషంలో హెడర్‌తో గోల్‌ కొట్టిన శామ్యూల్‌ ఉంటిటి ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపాడు. టోర్నీలో మేటి జట్లపై తిరుగులేని ప్రదర్శన చేసిన బెల్జియం సెమీస్‌లోనూ సత్తా చాటినా.. ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఆ జట్టు ఐదారుసార్లు గోల్‌కు గురిపెట్టింది. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లారిస్‌, డిఫెండర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రెండు మూడు గోల్స్‌ పడేవి. కానీ కీలక పోరులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన డిఫెన్స్‌ విభాగం ఫ్రాన్స్‌ను ఫైనల్‌ చేర్చింది. ప్రథమార్ధంలో బెల్జియం జోరు చూస్తే ఏ క్షణాన అయినా ఆ జట్టు గోల్‌ కొట్టేలా కనిపించింది. రెండు నిమిషాల వ్యవధిలో ఆ జట్టు చేసిన రెండు గోల్‌ ప్రయత్నాల్ని ఫ్రాన్స్‌ అడ్డుకుంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ హజార్డ్‌ 20వ నిమిషంలో కార్నర్‌ నుంచి బంతి అందుకుని మెరుపు వేగంతో గోల్‌ పోస్టు వైపు బంతిని పంపాడు. ఐతే ఫ్రాన్స్‌ డిఫెండర్‌ దాన్ని పక్కకు మళ్లించాడు. రెండు నిమిషాల తర్వాత టాబీ కొట్టిన షాట్‌ను గోల్‌కీపర్‌ లారిస్‌ కుడి వైపు డైవ్‌ చేస్తూ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. 40వ నిమిషంలో ఫ్రాన్స్‌ గోల్‌ కోసం చక్కటి ప్రయత్నం చేసింది. ఐతే పవార్డ్‌ కిక్‌ను బెల్జియం గోల్‌కీపర్‌ కోర్ట్‌వా.. కాలితో అడ్డుకుని ప్రత్యర్థికి ఆధిక్యం దక్కకుండా చేశాడు. అక్కడి నుంచి ఫ్రాన్స్‌ కొంచెం పైచేయి సాధించింది. ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే ఫ్రాన్స్‌కు కార్నర్‌ లభించింది. 51వ నిమిషంలో గ్రీజ్‌మన్‌ కార్నర్‌ షాట్‌ను తలతో ఒడుపుగా గోల్‌పోస్టులోకి పంపించిన ఉంటిటి ఫ్రాన్స్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. ఇక అక్కడి నుంచి ఫ్రాన్స్‌ వ్యూహాత్మకంగా, పూర్తి రక్షణాత్మకంగా ఆడింది. ఆ జట్టు డిఫెన్స్‌ దుర్బేధ్యంగా మారింది. లుకాకుతో పాటు బెల్జియం స్టార్‌ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. గోల్స్‌కు అవకాశమే ఇవ్వలేదు. అయినప్పటికీ 82వ నిమిషంలో బెల్జియంకు చక్కటి అవకాశం లభించింది. దాదాపు 20 గజాల దూరం నుంచి విట్సెల్‌ కళ్లు చెదిరేలా షాట్‌ ఆడాడు. కానీ గోల్‌ దగ్గర మరోసారి లారిస్‌ అడ్డం పడ్డాడు. తర్వాత బెల్జియంకు మరో అవకాశం రాలేదు. అదనపు సమయంలో ఫ్రాన్స్‌కే గోల్‌ తప్పింది. కెప్టెన్‌ హజార్డ్‌ మరోసారి సర్వశక్తులూ ఒడ్డినా.. లుకాకు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం బెల్జియంకు చేటు చేసింది. ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన. గ్రూప్‌ దశ నుంచి ప్రతి మ్యాచ్‌ గెలుస్తూ సెమీస్‌ చేరిన బెల్జియం ఇక్కడే జైత్రయాత్రను ముగించింది.

ఫ్రాన్స్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడమిది మూడోసారి. 1998లో తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఆ జట్టు.. కప్పు కూడా గెలిచింది. 2006లో ఫ్రాన్స్‌ రన్నరప్‌గా నిలిచింది.
* కనీసం మూడుసార్లు ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన ఆరో జట్టు ఫ్రాన్స్‌. జర్మనీ అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధిస్తే.. బ్రెజిల్‌ (6), ఇటలీ (6), అర్జెంటీనా (5), నెదర్లాండ్స్‌ (3) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* 2016లో స్పెయిన్‌తో స్నేహపూర్వక మ్యాచ్‌లో ఓడాక.. బెల్జియంకు ఇదే తొలి ఓటమి. ఆ జట్టు ఓటమి లేకుండా 24 మ్యాచ్‌లు ఆడింది.
* గ్రీజ్‌మన్‌ ఫ్రాన్స్‌ ఆడిన గత 20 మ్యాచ్‌ల్లో 20 గోల్స్‌లో భాగమయ్యాడు. సొంతంగా 12 గోల్స్‌ కొట్టిన అతను 8 గోల్స్‌కు సహకారమందించాడు.
* ప్రపంచకప్‌లో ఇంతకుముందు ఒక్కసారే, 1986లో బెల్జియం సెమీస్‌ చేరింది. అప్పుడు, ఇప్పుడు ఆ దశ దాటలేదు.

Leave a Reply