మానసిక స్థైర్యమే ఆయుధంగా..:ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో, క్రొయేషియా

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన అనంతరం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న క్రొయేషియా ఆటగాళ్లను చూసే ఉంటారు. అయితే ఆ కన్నీళ్ల వెనక అంతులేని విషాదం ఉంది. ఈ స్థాయికి చేరుకోవడంలో అలుపెరగని శ్రమ ఉంది. అంచనాలే లేని జట్టును తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ చేర్చడంలో అకుంఠిత దీక్ష ఉంది. అభిమానులు ఆశలను మోస్తూ అద్భుత ప్రదర్శన చేయడంలో అబ్బురపరిచే నైపుణ్యం దాగుంది. బతకడమే గగనంగా మారిన పరిస్థితుల నుంచి లక్షలాది అభిమానుల ఆశలను సజీవంగా నిలిపే స్థాయికి చేరిన ఆ జట్టు ఆటగాళ్లు అసలైన ఛాంపియన్లు. ఫైనల్లో క్రొయేషియా గెలిచినా.. గెలవకపోయినా ఆ జట్టు చూపిన తెగువ చరిత్రలో మిగిలిపోతుంది.

ఒకప్పుడు క్రొయేషియా ప్రజల జీవనం చాలా దుర్భరం. స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం కారణంగా తుపాకుల శబ్దాలతో తెల్లారి.. బాంబుల మోతలతో అక్కడి ప్రజలకు రోజు గడిచేది. బయట అడుగుపెడితే ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరతారో లేదో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చాలామంది కుర్రాళ్లు ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. దాన్నే జీవితం అనుకున్నారు. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా ఓర్చుకున్నారు. సరైన వసతులు లేకపోయినా వెనకడగు వేయలేదు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఆట ఆడారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఫుట్‌బాల్‌ ప్రపంచ విజేతలుగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచారు. దేశంలో కల్లోల పరిస్థితుల్ని తట్టుకుని నిలిచిన మనో నిబ్బరమే ఇప్పుడు వాళ్లను ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఈ స్థాయి దాకా తెచ్చింది!
మానసిక స్థైర్యమే ఆయుధంగా..: ‘‘మేం మానసికంగా చాలా బలవంతులం. ఎన్నో యుద్ధాలను దాటి ఈ స్థాయికి చేరుకున్నాం. ఆ యుద్ధాలే మాకు దృఢమైన మనో నిబ్బరాన్ని తెచ్చిపెట్టాయి. సెమీస్‌లో కూడా ఆ మానసిక స్థైర్యమే మాకు ఆయుధంగా నిలిచింది. దాంతోనే విజయం సాధించాం’’.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై విజయం తర్వాత క్రొయేషియా జట్టు డిఫెండర్‌ డీజన్‌ లోరెన్‌ అన్న మాటలివి. అతడి మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే వాళ్ల బాల్యం గడిచింది యుద్ధాల్లోనే మరి. స్వాతంత్రం కోరుతూ 1991లో క్రొయేషియన్లు పోరాటం మొదలుపెట్టారు. ఐతే అందుకు ససేమిరా అంటూ సైన్యాన్ని ప్రయోగించింది యుగోస్లోవియా. దీంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సైనయం ఇళ్లను కాల్చేయడం, దొరికిన వాళ్లను దొరికినట్లు చంపడం సర్వ సాధారణంగా మారిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన దుస్థితి వచ్చింది. నిత్యం బాంబు దాడులు, గ్రేనైడ్‌ శబ్దాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో పెరిగి పెద్దవుతూ ఫుట్‌బాల్‌ ఆటలో ఎదిగారు క్రొయేషియా కుర్రాళ్లు. చిన్నతనం నుంచే మానసిక నిబ్బరం అలవడి ఎంతకైనా పోరాడే తత్వాన్ని నేర్పింది.

శరణార్థులుగా మారి..: క్రొయేషియా ఆటగాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. స్వాతంత్రం కోసం క్రొయేషియా చేసిన యుద్ధం దాదాపు అందరు ఆటగాళ్ల చిన్ననాటి జీవితాలను అతలాకుతలం చేసింది. కొంతమంది పుట్టిన ఊరు వదిలి శరణార్థులుగా వేరే ప్రాంతాలకు చేరితే, కొందరేమో ఎక్కడికి వెళ్లాలో తెలీక బిక్కుబిక్కుమంటూ బతికారు. కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌ చేర్చిన లూకా మోద్రిచ్‌ ఆరేళ్ల వయసులో శరణార్థిగా మారాడు. డిఫెండర్‌ డీజన్‌ లోరెన్‌ కూడా చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి జర్మనీకి శరణార్థిగా వెళ్లాడు. ‘‘ప్రతి రోజూ సైరెన్‌ చప్పుడు వినిపించేది. దాంతో మా అమ్మ నన్ను తీసుకొని మా రహస్య స్థావరమైన గదిలోకి తీసుకెళ్లేది. శబ్దాలు ఆగిన తర్వాత బయటకు తీసుకొచ్చేది. కొన్ని రోజుల తర్వాత మా కుటుంబం మొత్తం జర్మనీకి వచ్చాం. అయితే ఏడేళ్లు జర్మనీలో ఉన్న మేం తర్వాత అధికారులు అక్కడినుంచి పంపించేయడంతో తిరిగి క్రొయేషియా చేరాం’’ అని గతాన్ని గుర్తుచేసుకున్నాడు లోరెన్‌.
దేశం చిన్నదే: క్రొయేషియా జనాభా కేవలం 41.7 లక్షలు. అంటే హైదరాబాద్‌ జనాభాలో సగం కంటే కొంచెం ఎక్కువ. వైజాగ్‌ జనాభాకు రెట్టింపు మాత్రమే. ఇంత చిన్న దేశమే ఫుట్‌బాల్‌ మహా సంగ్రామంలో తన సత్తాను చాటింది. ఆ జట్టు ఆటగాళ్లలో కూడా తాము తక్కువ అనే భావన ఎప్పుడూ కనిపించలేదు. క్రొయేషియా జట్టును తక్కువ అంచనా వేయడంతో ఇంగ్లాండ్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకుందని అంటున్నాడు మోద్రిచ్‌. ‘‘ప్రత్యర్థి జట్టు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. మమ్మల్ని తక్కువగా చూసినందుకు ఇంగ్లాండ్‌ తగిన మూల్యమే చెల్లించుకుంది. క్రొయేషియా జట్టు అలసిపోయింది. సెమీస్‌లో వీళ్లేం గెలుస్తారని చాలామంది అన్నారు. వాళ్లందరికీ మా విజయంతో సమాధానం చెప్పాలనుకున్నాం’’ అని మోద్రిచ్‌ చెప్పాడు.
కోళ్ల ఫామ్‌లో పనిచేసి..
చిన్నప్పుడు కోళ్ల ఫామ్‌లో పనిచేశాడు. కోళ్లకు దాణా వేయడం, ఫామ్‌ను శుభ్రం చేయడం లాంటి పనులు చేసేవాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం క్రొయేషియా దేశం మొత్తం అభినందించే స్థాయికి చేరాడు. అతనే క్రొయేషియా ఆటగాడు ఇవాన్‌ పెరిసిచ్‌. తన జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఇవాన్‌ బాల్యంలో తమ కుటుంబం నడిపే కోళ్ల ఫామ్‌లో పనిచేసేవాడు. దాంతో పాటే తనకిష్టమైన ఫుట్‌బాల్‌ను ఆడుతూ ఉండేవాడు. ఆ ఆటే అతని జీవితాన్ని మార్చింది. స్థానిక క్లబ్బుల్లో అతని ప్రదర్శన ఇవాన్‌ తలరాతేనే మార్చింది. చివరకు ప్రపంచకప్‌ను అందుకోవాలనే స్వప్నానికి అడుగు దూరంలో నిలిపింది.
పాఠశాల మాన్పించి..
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు బుద్ధిగా చదువుకోమనే చెబుతారు. పాఠశాల ఎగ్గొట్టకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండాలని ఆశిస్తారు. కానీ ఆ తండ్రి మాత్రం తన కొడుకును పాఠశాల మానెయ్‌ అని చెప్పాడు. ఫుట్‌బాల్‌కు అడ్డు వస్తుందని పాఠశాలకే వెళ్లొద్దన్నాడు. అప్పుడా తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఫలితం దక్కుతోంది. ఎందుకంటే ఆ కొడుకు ఎవరో కాదు. ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన క్రొయేషియా జట్టు ఆటగాడు బ్రొజోవిచ్‌. చిన్నతనంలో బ్రొజోవిచ్‌ వెళ్లే పాఠశాలలో ఫుట్‌బాల్‌ ఆడనిచ్చేవారు కాదు. దాంతో బ్రొజోవిచ్‌ తండ్రి అతణ్ని పాఠశాల మాన్పించి పూర్తిగా ఫుట్‌బాల్‌పైనే శ్రద్ధ పెట్టేలా చూశాడు.