రాజమౌళి :మహానుభావా నీకుసాటి ఎవరు ?

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత దర్శకుడు రాజమౌళి నుండి మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకులు పెద్ద సినిమాను ఆశించడం సహజమే. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎవరూ ఊహించిన రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేయడమే కాదు… తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుగా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్లానింగ్ భారీగా ఉంటుంది. తను తీయబోయే సినిమా బడ్జెట్‌కు తగిన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటారు. అలా పర్ఫెక్టుగా ప్లానింగ్ చేశారు కాబట్టే బాహుబలి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ రాజమౌళి అలాంటి ప్లానింగే చేస్తున్నారట….రూ. 300 కోట్ల బడ్జెట్ సినిమా అంటే కేవలం తెలుగు, తమిళంలో అయితే వర్కౌట్ కాదు. ఇండియాలో ఎక్కువ మార్కెట్ హిందీ సినిమాలకే ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అక్కడ మార్కెటింగ్ చేసేందుకు కరణ్ జోహార్‌ను రంగంలోకి దింపబోతున్నారట.

బాహుబలి సక్సెస్ వెనక కరణ్ జోహార్ బ్రాండింగ్ బాహుబలి ప్రాజెక్ట్ హిందీలో అంత పెద్ద విజయం సాధించిందంటే కారణం దాని వెనక కరణ్ జోహార్ బ్రాండింగ్ ఉందని చెప్పక తప్పదు. బాలీవుడ్లో ప్రముఖ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ బాలీవుడ్లో బాహుబలిని ప్రమోట్ చేయడం వల్లనే హిందీ ప్రేక్షకులు థియేటర్ల వరకు వచ్చారు. సినిమా కూడా అద్భుతంగా ఉండటంతో పెద్ద విజయం సాధించింది. అలా బాహుబలి సినిమాలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కేవలం తన ‘ధర్మా ప్రొడక్షన్స్’ బేనర్లో విడుదల చేయడం ద్వారా భారీ లాభాలు పొందారు…‘ఆర్ఆర్ఆర్’ మూవీకి నిర్మాత డివివి దానయ్యే అయినప్పటికీ సినిమా తెరకెక్కించడం దగ్గర నుండి నటీనటుల ఎంపిక, మార్కెటింగ్ వ్యవహారాలన్నీ రాజమౌళి అండ్ టీమ్ చూసుకుంటున్నారట. రాజమౌళి నిర్ణయం మేరకే కరణ్ జోహార్‌తో బాలీవుడ్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

నవంబర్ నుండి ప్రారంభం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నవంబర్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయకు రాలేదు. సినిమా లాచింగ్ సమయంలోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.