విజేత సినిమా రివ్యూ

నటీనట వర్గం; కళ్యాణ్ దేవ్,మాళవిక నాయర్,
మురళీ శర్మ,తనికెళ్ల భరణి,నాజర్,వి.జయప్రకాష్,
రాజీవ్ కనకాల
దర్శకత్వం:రాకేష్ శశి
విజేత సినిమా పేరు గుర్తుకు రాగానే మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఆకాశానికి ఎత్తిన చిత్రం గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రజాదరణ పొందిన టైటిల్‌తో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన అటెన్షన్ తప్పక ఉంటుంది. అదికాకుండా మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి టైటిల్‌తో వస్తున్నారంటే ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత టైటిల్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు.
తన మొదటి చిత్రానికి తండ్రి, కొడుకుల మధ్య నడిచే భావోద్వేగాన్ని కథగా మలిచుకొన్నాడు. అలాగే తొలిచిత్ర దర్శకుడు రాకేశ్ శశిని తనతోపాటు టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తమ తొలిచిత్రాలతో హీరో, దర్శకులు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకొన్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

ఎలా ఉందంటే..
కొడుకుపై గంపెడు ఆశలు పెట్టుకున్న తండ్రి.. జీవితంపై అస్సలు బాధ్యత లేకుండా తిరిగే కొడుకు.. తన తప్పు తెలుసుకుని తండ్రిని గెలిపించిన కొడుకు. ఇదే కాన్సెప్ట్‌తో తెలుగులో ఎన్ని సినిమాలు రాలేదు! ఇది కూడా అంతే. దర్శకుడు రాకేష్ శశి రొటీన్ కథనే ఎంచుకున్నారు. కథనం కూడా కొత్తగా ఏమీ రాసుకోలేదు. కానీ భావోద్వేగాలు మాత్రం చాలా బాగా చూపించారు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. ఇది తప్ప సినిమాలో కొత్తదనం ఏమీలేదు. సినిమా నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ తెలిసిన కథే కావడం, తరవాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించడం పెద్ద మైనస్. అయితే కిరిటీ, మహేష్ విట్ట, నోయల్, భద్రం, సత్యం రాజేష్ కామెడీ కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

ఫస్టాఫ్ మొత్తం స్నేహితులతో రామ్ అల్లరి, ఎదురింటిలోకి వచ్చిన జైత్ర (మాళవిక నాయర్)ను రామ్ ఇంప్రస్ చేయడానికి ప్రయత్నించడంతోనే సరిపోయింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్ కూడా అంత ఆసక్తికరంగా ఏమీలేదు. రామ్ కారణంగా తన తండ్రికి గుండెపోటు వస్తుంది. అయితే సెకండాఫ్‌లో తన తండ్రి స్నేహితుడు (తనికెళ్ల భరణి) రామ్‌కు గతం గురించి చెబుతాడు. కుటుంబం కోసం తన తండ్రి ఏం కోల్పోయాడో రామ్ తెలుసుకుంటాడు. చివరికి తండ్రిని గెలిపిస్తాడు. తండ్రి ఆశయాన్ని గెలిపించి రామ్ ‘విజేత’ అవుతాడు. అయితే సెకండాఫ్‌లో జరిగే డ్రామా మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందడం సినిమాకు మైనస్. దీనివల్ల ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలవుతాడు. కానీ క్లైమాక్స్‌ను మాత్రం దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్ సన్నివేశంలో మురళీ శర్మ నటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకి హీరో కళ్యాణ్ దేవ్ అని చెప్పడం కన్నా మురళీ శర్మ అని చెప్పడం సమంజసం. సినిమా మొత్తాన్ని ఆయన తన భుజస్కందాలపై నడిపించారు. ఓ మధ్యతరగతి కుటుంబ యజమానిగా అద్భుత నటనను కనబరిచారు. ఇది ఆయన కెరీర్‌లోనే ఓ మంచి పాత్ర అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఓ కొత్త మురళీ శర్మను చూస్తారు. ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ ఫర్వాలేదనిపించారు. ఆయన ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది. హీరోగా నిలదొక్కుకోవాలంటే ఈ నటన సరిపోదు. హీరోయిన్ మాళవిక నాయర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యతలేదు. ఉన్నంతలో బాగానే నటించింది. తనికెళ్ల భరణి, వి.జయప్రకాష్, రాజీవ్ కనకాల తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం..
సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత సాయి కొర్రపాటి చాలా రిచ్‌గా నిర్మించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా కనిపించింది. ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ను కూడా చాలా అందంగా చూపించారు. హీరో కళ్యాణ్ దేవ్‌ను వీలైనంత బాగా చూపించడానికి సెంథిల్ ప్రయత్నించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం. ఆయన అందించిన పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాను మరీ సాగదీయకుండా కత్తిరించిన ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ పనితనాన్ని మెచ్చుకోవాలి.

మైనస్ పాయింట్స్ కల్యాణ్ దేవ్ యాక్టింగ్ మాళవిక శర్మ ఫస్టాఫ్‌లో స్లో నెరేషన్

చివరిగా..
తండ్రి ఆశయాన్ని నెరవేర్చే రొటీన్ కొడుకు ఈ ‘విజేత’. కొత్తదనం లేకపోయినా కంటతడి పెట్టిస్తాడు. ఫైనల్‌గా తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణ, భావోద్వేగంతో నిండిన కథ ఇది. మాస్, థ్రిల్లర్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు విజేత కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. వారాంతంలో కుటుంబ ప్రేక్షకులు రెండు గంటలపాటు భావోద్వేగంతోపాటు చక్కగా వినోదించడానికి ఆస్కారం ఉన్న చిత్రం ఇది. కానీ ? రేటింగ్: 0.2/5