విశాఖ భయాందోళనలో ప్రజలు : రౌడీ షీటర్‌ ఎమ్‌డీ ఖాసిం హత్యకు గురయ్యాడు

నగరంలో పేరుమోసిన రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖాసిం గురువారం రాత్రి 10.30 గంటలు దాటాక హత్యకు గురయ్యాడు. ఇతనిపై గత ఏడాది అక్టోబరు 6 నుంచి పీడీ యాక్ట్‌ అమల్లో ఉంది. కారాగారంలో ఉన్న ఇతను ఇటీవలే తిరిగి బయటకొచ్చాడు. ఇతనిది సాలిపేట. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో ఖాసింతోపాటు సాయి, రాజేష్‌ అనే యువకులు కలిసి టీఎస్సార్‌ కాంప్లెక్సువైపు రెండు మోటారుసైకిళ్లపై వెళ్లారు. ఆ యువకులిద్దరూ అల్పాహారం కోసం వేరే చోటకు వెళ్లగా ఖాసిం ఎల్‌ఐసీ భవనం రహదారివైపు తెలుపు రంగు హోండా యాక్టివా (ఏపీ 31 డిఎన్‌ 8662 – ఇది శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరుమీద ఉంది) వచ్చాడు. ఆ వెనకే ఆటోలో ఇద్దరు, మోటారు సైకిల్‌పై మరో ఇద్దరు వచ్చారు. సరిగ్గా భవనం సమీపంలోకి రాగానే.. ఆటోలోని వ్యక్తులు పదునైన కత్తితో ఖాసిం మెడపై దాడి చేశారు. ఆ ధాటికి అతను పడిపోగా ఆటోలోంచి దిగిన ఇద్దరు మరోసారి బలంగా దాడి చేశారు. మెడ, రెండు, తల మరో రెండు బలమైన గాయాలున్నాయి. అతను సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా సహా ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు. నగరంలోని రౌడీషీటర్లందరినీ స్టేషన్లకు రప్పిస్తున్నారు.
నేర చరిత్ర.. : మహ్మద్‌ ఖాసిం పాత రౌడీషీటర్‌ అనిల్‌కు స్వయానా మేనమామ. ఇతను మతం మార్చుకున్నాడు. గతంలో అనిల్‌, పొడుగు కిరణ్‌ ముఠాల మధ్య పరస్పర దాడులు జరిగిన విషయం విదితమే. 2015లో అనిల్‌ హత్యకు గురయ్యాడు. ఇది పొడుగు కిరణ్‌ ముఠా పనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత కిరణ్‌ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీని వెనుక అనిల్‌ ముఠా ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఈ రెండుముఠాలు కొద్దికాలంపాటు ఎలాంటి ప్రతిచర్యలకు పాల్పడలేదు. గతేడాది అక్టోబరులో అనిల్‌ ముఠాలోని ఖాసింపై అప్పటి కమిషనర్‌ యోగానంద్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. దీంతో అతను కారాగారానికి వెళ్లాల్సి వచ్చింది. గత ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించిన ఖాసిం ఆ తరువాత బయటకొచ్చాడు. కొన్నాళ్లపాటు అజ్ఞాంతోనే ఉన్నాడు. ఈమధ్యకాలంలో కిరణ్‌ ముఠాలోని చిట్టిమమ్ము గ్యాంగ్‌ చలామణీలోకి వచ్చింది. ఖాసిం బయటకొచ్చిన విషయాన్ని చిట్టిమమ్ము గ్యాంగ్‌ పసిగట్టి ఉండొచ్చని పోలీసుల అనుమానం. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఈ ముఠా సంచరించడాన్ని కూడా వారు గుర్తించారు. బుధవారం రాత్రి పందిమెట్ట ప్రాంతంలోని ఓ బార్‌లో ఘర్షణ జరిగింది. దీనిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటనలో ఖాసిం ఉన్నాడేమోనని పోలీసులు తొలుత అనుమానించారు. ఈలోగా చిట్టిగ్యాంగ్‌ గురించి సమాచారం అందటంతో ఈ దిశగా అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా అన్ని స్టేషన్ల సిబ్బందిని వెంటనే రంగంలోకి దింపారు. రౌడీషీటర్లందరినీ ఆయా స్టేషన్లకు రప్పిస్తున్నారు. నిందితులు నగరం విడిచి పారిపోకుండా ఎక్కడికక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

ఖాసింపై ఎన్నో కేసులు
నగరంలోని దాదాపు అయిదారు హత్య కేసుల్లో ఖాసిం కీలక నిందితుడని పోలీసులు చెప్పారు. ఎనిమిదేళ్ల కిందట కంచరపాలెం రాంజీ ఎస్టేట్‌లో జంట హత్యల కేసుల్లోనూ, జిల్లా పరిషత్తు ప్రాంతంలో లచ్చు అనే రౌడీషీటర్‌ హత్య కేసులోనూ ఇతను కీలక నిందితుడు. మరికొన్ని కేసులు కూడా ఉన్నట్టు సమాచారం.

ఖాసింపై రెండోపట్టణ పోలీసుస్టేషన్లో రౌడీషీట్‌ ఉంది.
బంధువుల కన్నీరుమున్నీరు…. : హత్య విషయం తెలుసుకుని సాలిపేటలోని ఖాసిం కుటుంబసభ్యులతోపాటు అతని అనుచరులు కూడా పెద్దఎత్తున సంఘటనస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అతను సాలిపేటలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పెంచుకుంటున్న కుక్కకు ఘనంగా జన్మదినవేడుకలు జరుపుతూ భారీ సంఖ్యలో జనాలకు విందు భోజనాలు ఏర్పాటుచేస్తూ ఆ ప్రాంతంలో పలువురికి సుపరిచితుడిగా మారాడు. పొడుగు కిరణ్‌ను ఎలాగైనా అంతమొందిస్తానని అనిల్‌ హత్యకు గురైనప్పుడు ఆయన కొందరి ముందు శపథం చేసినట్లు పోలీసులకు తెలియడంతో పోలీసులు అతనిపై గట్టి నిఘా పెట్టారు.

ఉన్నతాధికారుల ఆరా….
ఖాసిం హత్య గురించి తెలుసుకున్న ఏసీపీ నరశింహమూర్తి, డీసీపీ ఫకీరప్ప, సీపీ మహేష్‌చంద్రలడ్డా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు. చిట్టిమమ్ము, టేకుమూడి లక్ష్మణ్‌ అనే వ్యక్తుల పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితుల కోసం వేట మొదలుపెట్టాం…
ఖాసీంపై 12 వరకూ హత్యకేసులున్నాయి. రౌడీషీట్‌ కూడా ఉంది. ప్రత్యర్థులైన చిట్టిమమ్ము, గణేష్‌లు హత్య చేసి ఉంటారని భావిస్తున్నాం. నిందితుల కోసం వేట మొదలుపెట్టాం. త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం.

-మహేష్‌చంద్ర లడ్డా, నగర పోలీస్‌ కమిషనర్‌
సీపీ మారినప్పుడల్లా..
నగరంలో పోలీస్‌ కమీషనర్‌ మారినపుడల్లా ముఠాలు రెచ్చిపోవడం జరుగుతోంది. కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించి ఇక్కడి పరిస్థితిపై అవగాహన పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీంతో సిబ్బంది కూడా కొంత నిర్లిప్తంగా ఉంటారు. ఈ సమయాన్నే హంతక, దొంగల ముఠాలు ఆసరాగా తీసుకుంటున్నాయి. కొత్త కమిషనర్‌ లడ్డా మొన్ననే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ప్రత్యర్థుల పనే..
ఖాసింకు..బైక్‌తో వెంబడించి మరి ఈదారుణానికి పాల్పడ్డారు. అతనికి ప్రత్యర్థిగా ఉన్న మరో రౌడీ షీట ర్‌కు మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయని, అవే ఈ హత్యకు దారి తీశాయని సీపీ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు.

Leave a Reply