విశాఖ మరోసుందర నగరం కాబోతుంది :ఎంపీ హరిబాబు


న్యూస్‌టుడే: పోలవరం నిర్మాణానికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని విశాఖ ఎం.పి. డాక్టర్‌ కె.హరిబాబు అన్నారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరి నేటి నుంచి విశాఖ పర్యటనకు వస్తున్నారన్నారు. ఎం.పి. కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
* గడ్కరి బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. సాయంత్రం విశాఖలో సాయిప్రియ రిసార్ట్సులో పోలవరం ప్రగతిని భాజపా నాయకులకు వివరిస్తారు.
* 12, 13 తేదీల్లో గడ్కరి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. షిప్పింగ్‌, రోడ్‌ ట్రాన్స్‌పోర్టు హైవేస్‌ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
* 13న మధ్యాహ్నం నుంచి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.80 కోట్లతో విశాఖ పోర్టు రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ రహదారిని జాతికి అంకితం చేస్తారు.
* కాన్వెంట్‌ కూడలిలో పోర్టు అనుసంధానంగా రూ. 40 కోట్లతో నిర్మించబోయే పోర్టు రహదారి పనులకు భూమిపూజ జరుపుతారు. పి.పి.పి. పథకం ద్వారా రూ.580 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు ఓర్‌బెర్త్‌ 1.2లో అధునికీకరించిన అధునాతన ఐరన్‌ఓర్‌ హేండ్లింగ్‌ కాంప్లెక్సును ప్రారంభిస్తారు.

* భారత్‌మాల పథకంలో భాగంగా రూ. 549 కోట్లతో సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకు పోర్టును కలుపుతూ 4 వరుసల రహదారి పనులకు, రూ.2013 కోట్లతో ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా అనకాపల్లి వరకు ఆరులైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.

* ఇచ్చాపురం నుంచి నర్సన్నపేట వరకు రూ.439 కోట్లతో, నర్సన్నపేట నుంచి రణస్థలం వరకు రూ.1350 కోట్లు, రణస్థలం నుంచి ఆనందపురం వరకు రూ.1187 కోట్లతో చేపట్టబోయే ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు కూడ ఆయన శంకుస్థాపన చేస్తారు.

* విశాఖ విమానాశ్రయంలో నేవీ పౌర విమానాల సమయాల మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో నౌకాదళాధికారితో మాట్లాడామన్నారు. సిబ్బంది శిక్షణను విమానాల రాకపోకలు లేని మధ్యాహ్నం సమయంలో పెట్టుకోవాలని సూచించామని పేర్కొన్నారు. విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఒకటే రన్‌వే ఉండటంతో సమాంతరంగా రవాణా కోసం రన్‌వే నిర్మాణానికి పోర్టు స్థలం 35 ఎకరాలను సేకరించటానికి
కేంద్రమంత్రి గడ్కరితో చర్చిస్తామన్నారు. విజయనగరం జిల్లా బాడంగి ఎయిర్‌స్ట్రిప్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని నేవీ అధికారులు తెలియజేసినట్లు ఎం.పి. హరిబాబు తెలిపారు.

* ప్రభుత్వ మానసిక ఆసుపత్రి ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, మానసిక ఆసుపత్రి సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ రాధ తదితరులు పాల్గొన్నారు.