3 లక్షల కోట్లు ఆంధ్రప్రేదేశ్ అభివృద్ధి కి ఇస్తున్నాం :కేంద్రమంత్రి గడ్కరీ,

రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు. విశాఖకు రైల్వేజోన్‌ మంజూరు కావడానికి నా వంతు కృషి చేస్తా. విశాఖలో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రయివేటీకరణ, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ఉండదు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర మంత్రిమండలి తన ఆమోదం తెలుపుతుంది. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. దీనిని విశాఖ పోర్టు, పారాదీప్‌పోర్టు, న్యూమంగళూరు పోర్టుల సంయుక్త ఆధ్వర్యంలో నడిచేలా కసరత్తు చేస్తున్నాం. విశాఖలో నీటిలో తేలియాడే రెస్టారెంట్‌ నిర్మాణానికి కృషి చేయాలి. ఇది పర్యాటకరంగాభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది. క్రూయిజ్‌ టెర్మినల్‌ ఏర్పాటును వేగవంతం చేయాలి. వినూత్న పడవలతో క్రూయిజ్‌ సర్వీసులు నడిపితే పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
– నితిన్‌ గడ్కరీ
* శంకుస్థాపనలు : కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి రూ. 6,688 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ‘ఈ-శంకుస్థాపన’లు చేశారు. అవి..
* రూ. 444.50 కోట్లతో ఇచ్ఛాపురం – నరసన్నపేట రహదారి విస్తరణ.
* రూ. 1665 కోట్లతో నర్సన్నపేట – రణస్థలం రహదారి ఆరు వరుసల విస్తరణ
* రూ. 1239 కోట్లతో రణస్థలం – ఆనందపురం రహదారి ఆరు వరుసల విస్తరణ
* రూ. 2561 కోట్లతో ఆనందపురం – పెందుర్తి – అనకాపల్లికి ఆరు వరుసల రహదారి
* రూ. 619 కోట్లతో సబ్బవరం – షీలానగర్‌ నాలుగు వరుసల రహదారి అభివృద్ధి
* రూ. 60 కోట్లతో కాన్వెంట్‌ కూడలి వద్ద గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణం
* రూ. 100 కోట్లతో విశాఖ పోర్టు నుంచి జాతీయ రహదారి వరకు నాలుగువరుసల్లో నిర్మించిన రహదారి జాతికి అంకితం
: డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రయివేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఏయూ ఎ.యు.కన్వెన్షన్‌ కేంద్రంలో వివిధ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టు అభివృద్ధికి పలు సూచనలు చేశారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పోలవరం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జీవనరేఖలాంటిదన్నారు. అలాంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి గడ్కరీ చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు ఆయన పోలవరాన్ని సందర్శించారన్నారు. అందరూ కోరుకుంటున్నట్లు ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి, విశాఖపట్నం రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. భూసేకరణ పూర్తై పనులు ప్రారంభం కానున్నాయన్నారు. నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇరు ప్రభుత్వాల మధ్య సయోధ్య లేనప్పటికీ కేంద్రం రాష్ట్ర అభివృద్ధిపై రాజీపడబోదన్నారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైల్వేజోన్‌ విశాఖవాసుల మూడు దశాబ్దాల కలని గుర్తు చేశారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయడం కోసం సీఎం 29సార్లు దిల్లీకి వెళ్లారన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన 18 హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నితిన్‌గడ్కరీ విశాల భావాలున్న వ్యక్తి అని పార్టీలకు అతీతంగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో ఆయన కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా తాను ఆయన చేతుల మీదుగా 12 అవార్డులు అందుకున్నానని గుర్తు చేశారు. అనకాపల్లి నుంచి పెందుర్తి మీదుగా ఆనందపురం వరకు రూ. 2,561 కోట్ల వ్యయంతో ఆరు వరుసల జాతీయ రహదారిని నిర్మించడంతో జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరుతున్నట్లువుతుందని పేర్కొన్నారు. విశాఖలో రూ. 6,688 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ప్రశంసనీయమన్నారు.

‘‘రాజకీయాలు వేరు.. ప్రగతి వేరు.. ఆంధ్రప్రదేశ్‌కు మేం తొలినుంచీ అండగా ఉన్నాం.. ఆ మద్దతునే ఇకపైనా కొనసాగిస్తాం..’’ అంటూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ బాస చేశారు. ‘‘విభజనతో చాలా నష్టపోయాం… మేం మిగతా రాష్ట్రాల స్థాయికి వచ్చేవరకూ న్యాయంగా మాకు రావాల్సిన వాటాపై రాజీలేని పోరాటం చేస్తాం..’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తమతమ వైఖరిని సుస్పష్టంచేశారు. శుక్రవారం నగరంలోని ఎ.యు.కన్వెన్షన్‌ కేంద్రంలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమాలకు ఇరువురు నేతలూ హాజరై ప్రసంగించారు. కాగా సదస్సుకు విచ్చేసిన భాజపా, తెదేపా కార్యకర్తలు తమతమ పార్టీలకు, నేతలకు మద్దతుగా ఫొటోలను ప్రదర్శించడం, నినాదాలివ్వడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. సభా ప్రాంగణం బయట కూడా ఇరు పార్టీ వారు నినాదాలు చేయడం గమనార్హం.

Leave a Reply