పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం

టైమ్ కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందట. కచ్చితంగా ఆ సామెత చంద్రబాబుకు సరిపోతోంది. అవునుమరి. రాజధాని నిర్మాణం అంటూ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ.. ఏ ఒక్క విషయంలోనూ చంద్రబాబుకు కలిసి రావటంలేదు. పైగా అన్నివిధాలా ఆయనకు నష్టదాయకంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి అసెంబ్లీలో జగన్ ఛాంబర్ పూర్తిగా కారిపోయిన వ్యవహారం దేశ వ్యాప్తంగా చంద్రబాబు పరువును తీసేసింది. కనీసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని కట్టుకోలేని వ్యక్తి ఇక శాశ్వత రాజధానిని ఏం కడతారంటూ నేషనల్ మీడియా సైతం దుమ్మెత్తి పోసింది.

ఏసీ పైపును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేయటం వల్లే నీరు లోపలకు వచ్చిందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పటం,పైగా దీనిపై సీఐడీ విచారణ జరిపిస్తానంటూ ప్రకటించటంతో చంద్రబాబు సర్కారు పరువు మరింతగా బజారున పడింది. 24 గంటలూ పటిష్టమైన సెక్యూరిటీ ఉండే అసెంబ్లీ పైభాగానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేరుకుని పైపును కోసేస్తుంటే మరి సెక్యూరిటీ ఏంచేస్తున్నట్లు? అంటే సెక్యూరిటీ సరిగ్గా లేదని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా? దీంతోపాటు విదేశాల నుంచి తెప్పించిన సీసీ కెమేరాలతో నిఘా ఉందని చెప్తున్నారు.

కానీ ఇంతవరకూ ఆ సీసీ కెమెరాలో ఏంరికార్డయిందో వెల్లడికాలేదు. పైగా ఈమొత్తం వ్యవహారాన్ని సీఐడీతో విచారణ జరిపిస్తున్నామనగానే దేశమంతా ఘొల్లున నవ్వుకుంది. ఒక చిన్న విషయాన్ని కూడా సీఐడీతో విచారణ అనగానే పిచ్చుక మీద బ్రహ్మాస్తం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వచ్చాయి. ఏదేమైనా ఈ పైపు కోత వ్యవహారం వెనుక ఎవరున్నారో ఎప్పటికి తేలుతుందో ఎవ్వరికీ తెలియదు. ముందుగా చేసిన ప్రకటనలైతే చంద్రబాబు ప్రతిష్టను మంట గలిపాయనటంలో సందేహంలేదు.